పట్టణాల్లోని ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్)కు పట్టణ స్థానిక సంస్థలు రూ.270.06 కోట్లు బకాయి పడ్డాయి. ఈ ప్రభావం నగరాలు, పట్టణాల్లోని వీధి దీపాల నిర్వహణపై కనిపిస్తోంది. చీకటిపడగానే వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ దీపాలు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ప్రాజెక్టు నిర్వహణ, క్షేత్రస్థాయిలోని సిబ్బందికి జీతాలు కష్టమవుతోందని ఈఈఎస్‌ఎల్ అధికారులు ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. వీధిదీపాల నిర్వహణ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో 106 పుర, నగరపాలక సంస్థల్లో వీటి బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌కి అప్పగించారు.
వీధుల్లో ఉన్న బల్బులు, ట్యూబ్‌లైట్ల స్థానంలో ఈఈఎస్‌ఎల్ 7 లక్షలకు పైగా ఎల్‌ఈడీలను ఏర్పాటు చేసింది. దీంతో యాభై శాతం వరకు విద్యుత్తు ఆదా అయినట్లు అప్పట్లో గుర్తించారు. ఇలా మిగిలే మొత్తం నుంచి ఎల్‌ఈడీల ఏర్పాటుకయ్యే పెట్టుబడి, ప్రతి నెలా వాటి నిర్వహణ ఖర్చును పట్టణ స్థానిక సంస్థలు ఏడేళ్లలో ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించాలి. 2015లో ఒప్పందం నాటి నుంచి 2021 జూన్ వరకు రూ.541.53 కోట్లు చెల్లించాలని ఈఈఎస్‌ఎల్ లేఖలు రాసింది. పట్టణ స్థానిక సంస్థలు ఇప్పటి వరకు రూ.271.47 కోట్లు జమ చేశాయి. మరో రూ.270.06 కోట్లు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం మూడు నెలలకోసారి బిల్లులు చెల్లించాలన్న నిబంధనను పుర, నగరపాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదు.
బిల్లులు చెల్లించరు..బాధ్యత గుర్తు చేయరు
పట్టణ స్థానిక సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈఈఎస్‌ఎల్ క్షేత్రస్థాయి సిబ్బంది వీధి దీపాల సమస్యలపై గతంలో మాదిరిగా తక్షణం స్పందించడం లేదు. సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే ప్రశ్నించే అధికారం పురపాలక అధికారులకు ఉంది. గడువులోగా ఎల్‌ఈడీలు వెలిగించకపోతే జరిమానా కూడా విధించొచ్చు. ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగులో ఉన్నందున అధికారులు కూడా దీనిపై వారిని ప్రశ్నించడం లేదు.
ప్రభావం ఇలా..
- విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ఉన్న ఎల్‌ఈడీ దీపాల్లో 20- 25 శాతం వరకు సరిగా వెలగడం లేదు. ఒప్పందం ప్రకారం 90 శాతానికి పైగా లైట్లు వెలగాలి. గతంలో వీధుల్లో, శివారు ప్రాంతాల్లో ఎల్‌ఈడీలు వెలగడం లేదని ఫిర్యాదులొచ్చేవి. ఇప్పుడు ప్రధాన కూడళ్లు, రహదారుల్లోని వీధిదీపాలదీ అదే పరిస్థితి. విజయవాడ, విశాఖపట్నం నగరం మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లోనూ ఎల్‌ఈడీలు అరకొరగానే వెలుగుతున్నాయి.
- ఒంగోలు, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు, కడప, కర్నూలుల్లో వీధి దీపాల సమస్యలపై సకాలంలో స్పందించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. కొన్ని వీధుల్లో వరుసగా నాలుగైదు ఎల్‌ఈడీలు వెలగకపోయినా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.ప్రధాన కూడళ్లలో ఒకే స్తంభానికి ఐదారు లైట్లున్న చోట ఒకటి, రెండుకు మించి వెలగడం లేదు.
- గతంలో ఎల్‌ఈడీలు పాడైతే 24 గంటల్లోనే మార్చి కొత్తవి వేసేవారు. ఇప్పుడు వారం రోజులైనా స్పందన ఉండటం లేదు. పురపాలక సంఘాల్లో వీధి దీపాల సమస్య మరింత తీవ్రంగా ఉంది.
ఇదీ చదవండి
polavaram : పోలవరం రివైజ్డ్ అంచనాలు..హైదరాబాదే దాటలేదు