డ్రోన్ తయారీలో సత్తా చాటుతున్న కృష్ణా జిల్లా యువకుడు కృష్ణా జిల్లాలోని గండిగుంట గ్రామానికి చెందిన కమల్ నితీశ్‌కు పదోతరగతిలో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీపై ఆసక్తి కలిగింది. ఆకట్టుకునే అందమైన ఫోటోల కోసం డ్రోన్లు వినియోగించటంతో వాటి తయారీపై దృష్టి పెట్టాడు. అలా పదో తరగతిలో ఉన్నప్పుడే కమల్... డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టాడు. అంతర్జాలం సాయంతో సమాచారం తెలుసుకుని సొంతంగా డ్రోన్లు రూపొందించటం ప్రారంభించాడు.
జీపీఎస్ డ్రోన్ల తయారీ
తొలుత ఫోటోగ్రఫీ కోసం రిమోట్ సాయంతో పనిచేసే డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేశాడు...కమల్. తర్వాత...తండ్రి ఆర్ధిక సాయంతో వివిధ రకాల అవసరాలకు సరిపోయే ఆధునిక సాంకేతికతతో కూడిన జీపీఎస్ డ్రోన్లను ఆవిష్కరించాడు. భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ డ్రోన్, మంటలు ఆర్పేందుకు ఫైర్ డ్రోన్, క్రిమి సంహారక మందుల్ని పిచికారీ చేసేందుకు అత్యాధునిక డ్రోన్లను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.
యువతకు ఉచిత శిక్షణ
ఏరో డ్రోన్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థను నడుపుతున్న కమల్... డ్రోన్ల తయారీపై ఆసక్తి ఉన్న యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న కమల్.. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి... నూతన డ్రోన్ల రూపకల్పనలో భాగస్వాముల్ని చేస్తున్నాడు. డ్రోన్ల తయారీలో కమల్ నితీశ్ చూపుతున్న సృజన, ప్రతిభను సాంకేతిక రంగ నిపుణులు మెచ్చుకుంటున్నారు. కుమారుడు తయారు చేసిన డ్రోన్లు రైతులకు వ్యవసాయంలో అండగా నిలవటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంకుర సంస్థను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి... దేశంలోనే అధునాతన డ్రోన్లు తయారు చేసే సంస్థగా నిలపడమే లక్ష్యంగా కమల్ నితీశ్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆ దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఇదీ చదవండి:
ఉల్లి ఘాటు తీరిందో లేదో.. ఇక వంట నూనెల మంట!