అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలనే డిమాండ్‌తో త్వరలోనే దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
"పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని వైకాపా ప్రహసనంలా మార్చింది. అన్ని సౌకర్యాలతో 9 లక్షల పైచిలుకు ఇళ్లను పేదల కోసం చంద్రబాబు నిర్మాణానికి తలపెడితే, వైకాపా గత రెండున్నరేళ్ల నుంచి ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టుకున్న ఇళ్లు అనే కక్షతో లబ్ధిదారులకు బిల్లులు కూడా జగన్ రెడ్డి చెల్లించట్లేదు. వైకాపాలో చేరి ఇళ్లకు పార్టీ రంగులు వేసుకుంటే బిల్లులు చెల్లిస్తామని పేదలను బలవంతపెడుతున్నారు. రూ.1300కోట్లకు పైగా బిల్లులు 3.38లక్షల పేదలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంత పేదలకు రూ.800కోట్లు ఇవ్వాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2019-20, 2020-21లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమే చెప్పింది. కుల, మతాలు చూడనంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వాటితో పాటు రాజకీయం కూడా చూస్తూ పేదలను వేధిస్తున్నాడు. జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలని పేదలను బలవంతపెట్టడాన్ని తెదేపా వ్యతిరేకిస్తోంది" అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా జగన్ పాలన..