కారణం ఏదైనా... దేశ ప్రధాని పిలుపు, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దేశ ప్రజలు, ప్రధానంగా తెలుగు ప్రజలు తమ బాధ్యతను చాటుకున్నారు. ప్రతీఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేశారు. జనతా కర్ఫ్యూలో పోలీసుల పాత్ర ఉన్నప్పటికీ... ప్రజల సహకారం మాటల్లో చెప్పలేనిది. దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలు నిర్మానుష్యంగా మారడమే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ప్రజలు స్పచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉంటే దానిని ఎదుర్కొవడం పెద్ద విషయం కాదని నిరూపించారు ప్రజలు. ఇదే స్పూర్తితో పౌరులు ఉంటే కరోనా కోరలు చాచకుండా నిరోధించడం కష్టమేమి కాదని ప్రభుత్వాలకూ నమ్మకం కుదిరింది.