PAWAN KALYAN ON UNION BUDGET: ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెట్ ను భాజపా ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాల ప్రస్థావన లేకపోవడం.. కొంత నిరాశను కలిగించిందని తెలిపారు. సేంద్రీయ ప్రకృతి సేద్యానికి ప్రాధ్యానం ఇవ్వడం శుభ పరిణామం అన్ని పేర్కొన్నారు.
ఇది చూడండి:నిర్మలమ్మ పద్దు ఏ రంగాలకు ఎంతిచ్చింది?
అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం పోటీ పడే విధంగా ఒక గొప్ప దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టడానికి సంకల్పించిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందిస్తాయని జనసేన భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి గతిశక్తి బహుళార్ధక పథకమని.. అది దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చే విధంగా ఉందని పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా వ్యాపార వ్యవహారాలు, నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగి అవకతవకలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా దేశ సాంకేతిక అవసరాలు తీర్చగల మంచి ప్రమాణాలు కలిగిన టెక్కీలు అందుబాటులోకి వస్తారని చెప్పారు. ప్రాంతీయ భాషాల్లో విద్యా బోధన కోసం 200 టీవీ ఛానళ్లను ప్రారంభించాలనుకోవడం.. ప్రాంతీయ భాషల్లో చదువుకోవాలనుకునేవారికి మేలు చేస్తుందని అన్నారు.