కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ప్రముఖ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించింది. శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు వినిపించడానికి బలమైన గొంతుక అవసరమని, అందుకే ఆయన పేరును ప్రకటించినట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు.
జ్ఞానాన్ని, మంచి నడవడికను నేర్పించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైకాపా ప్రభుత్వం మంటగలిపిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు క్యూ లైన్లు సరిచేసే వాచ్మెన్ పనులకు ఉపయోగించి అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని అనేక సమస్యలు పీడిస్తున్నాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ఏ సమయంలో అయినా ప్రజలకు అండగా నిలబడే గాదె వెంకటేశ్వర రావు లాంటి వ్యక్తులు సమాజ సేవలోకి రావాలని పవన్ అభిప్రాయపడ్డారు.