పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేసేందుకు అధికారులు.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇది కార్యరూపంలోకి వస్తే 1971లో ఏర్పాటైన ఇంటర్ విద్యామండలి కనుమరుగు కానుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే.. రెండు శాఖల అధికారులు ఉంటారు. నూతన జాతీయ విద్యా విధానం 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున... ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటు న్నారు.
ఇంటర్మీడియట్లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి-NCERTలో విలీనం చేస్తారు. ఇంటర్ వృత్తి విద్యా కోర్సులను సమగ్రశిక్ష అభియాన్ నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో కలిపేస్తారు. పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు కలిపి.. కొత్తగా డైరెక్టర్ అకడమిక్, డైరెక్టర్ పరిపాలన, డైరెక్టర్ అకౌంట్స్ విభాగాలను ఏర్పాటు చేస్తారు. వీటి కిందికి 2 శాఖల్లోని వారిని తీసుకొస్తారు.