తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తగ్గించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. తీవ్రవాదులు, మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లు, అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అన్నారు. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు.... భద్రత సిబ్బంది సంఖ్యను 146 నుంచి 67కు కుదించడం ఏంటని ఓ ప్రకటనలో మండిపడ్డారు.
ఎమ్మెల్సీ లోకేశ్ మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లోకేశ్ భద్రతను కూడా జడ్ స్థాయి నుంచి ఎక్స్ స్థాయికి తగ్గించారని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందన్న ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నా.... భద్రత కుదింపు దురుద్దేశ పూరితమేనని అన్నారు. వారికి ఏదైనా ముప్పు వాటిల్లితే వైకాపా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.