ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TAX IN AP : ఆస్తి పన్ను మోత మొదలు...పెంచిన మొత్తాలతో డిమాండ్ నోటీసుల జారీ - tax

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానే... ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కడుతున్న పన్నుని 10 నుంచి 15 శాతం పెంచుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించిన డిమాండ్‌ నోటీసులను (పన్ను తాఖీదులు) జారీ చేస్తోంది.

ఆస్తి పన్ను మోత మొదలు
ఆస్తి పన్ను మోత మొదలు

By

Published : Jan 20, 2022, 7:18 AM IST

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో సుమారు 33.67 లక్షల అసెస్‌మెంట్లు (నివాస, వాణిజ్య, ఇతర భవనాలు) ఉండగా... ఇప్పటికే సగానికిపైగా భవనాల యజమానులకు నోటీసులు వెళ్లాయి. ఈ నెలాఖరులోగా మొత్తం నోటీసులు జారీ చేయనున్నారు. ఆస్తి మూలధన విలువను ఎలా లెక్కించారు? గతానికీ... కొత్త విధానానికీ పన్ను ఎంత శాతం పెరుగుతోంది? వంటి వివరాలన్నీ ఆ డిమాండ్‌ నోటీసులో స్పష్టంగా పేర్కొంటున్నారు.

అద్దె ఆధారిత పన్ను విధానం నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల పెరిగిన భారాన్ని ప్రజలపై ఒకేసారి వేయకుండా... పెంచాల్సిన పన్ను 15 శాతం కంటే ఎక్కువ ఉంటే... మొదటి సంవత్సరం 15 శాతమే పెంచాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యత్యాసం 10-15 శాతం మధ్య ఉంటే... అది ఎంత శాతమైతే అంతా పెంచాలని, 10 శాతం కంటే తక్కువ ఉంటే కనీసం 10 శాతం పెంచాలని నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు కడుతున్న పన్నుపై ఎవరికైనా సరే మొదటి సంవత్సరం కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 15 శాతం పెంపు ఉంటుంది. ఇది ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న భవనాలకు మాత్రమే.
* విజయవాడలో 34వ డివిజన్‌లో ఉంటున్న ఒక వ్యక్తి తన ఇంటికి ఇప్పటివరకు ఆరు నెలలకు రూ.318 చొప్పున ఏడాదికి రూ.636 పన్ను చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో ఆయనకు ఆరు నెలలకు పన్ను రూ.1,038 (సంవత్సరానికి రూ.2,076)గా నిర్ణయించినట్టు నగరపాలక సంస్థ డిమాండ్‌ నోటీసు పంపింది. ఇప్పుడు కడుతున్న పన్ను కంటే సంవత్సరానికి రూ.1440 (228 శాతం) పెరిగింది. అయితే మొదటి సంవత్సరం గరిష్ఠంగా 15 శాతానికి మించి పెంచకూడదన్న నిబంధనతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు రూ.366 (సంవత్సరానికి రూ.732) పన్ను చెల్లించాలని పేర్కొంది. 2022-23లో రూ.732పై మరో 15 శాతం పెంచి రూ.841 వసూలు చేస్తుంది. అలా ఏటా 15 శాతం చొప్పున రూ.2,076తో సమానమయ్యేదాకా పెంపు నిరంతరంగా ఉంటుంది.
* అనంతపురంలోని 12వ డివిజన్‌కు చెందిన ఒక భవన యజమాని ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,038 పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా చూస్తే ఏడాదికి రూ.12,640 పన్ను కట్టాల్సి ఉంటుందని నోటీసు పంపింది. అంటే 109 శాతం పెరిగింది. మొదటి సంవత్సరం పన్ను పెంపు గరిష్ఠంగా 15 శాతానికి పరిమితం చేయాలన్న నిబంధన వల్ల 2021-22లో రూ.6,944 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త భవనాలకు...
* కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చే నాటికి లేదా వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తి చేసుకుని, ఇంకా పన్ను వేయని భవనాలకు మాత్రం... మూలధన విలువ ఆధారంగా లెక్కించిన మొత్తం పన్నునే వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం వేయడం లేదు. వాటికి ఒకేసారి భారీగా వేస్తే జనంలో వ్యతిరేకతకు దారితీస్తుందనే ప్రస్తుతానికి వాటికి పన్నులు వేయడం లేదన్న అభిప్రాయం చెల్లింపుదారుల్లో ఉంది.
* పాత భవనాల్లో ఏమైనా మార్పులు చేసి ప్లింత్‌ ఏరియా పెంచుకున్నా, అదనపు అంతస్తులు నిర్మించినా, ప్రస్తుతం నివాసంగా ఉన్నదాన్ని ఏ వాణిజ్య భవనంగానో వినియోగించుకోవాలనుకున్నా, పై కప్పుగా ఏ ఆస్బెస్టాస్‌ రేకులో ఉంటే, వాటిని తీసేసి శ్లాబ్‌ వేసుకోవడం వంటి మార్పులు చేసినా కూడా... మొత్తం భవనానికి ఆస్తి మూలధన విలువ ఆధారంగా లెక్కించిన పన్ను మొత్తాన్ని అప్పటి నుంచి వసూలు చేస్తారు. వారికి ఏటా 15 శాతం చొప్పున పెంపు నిబంధన వర్తించదు. ఆ విషయాన్ని డిమాండ్‌ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.
* చాలా నగరాలు, పట్టణాల్లో గత ఏడాది అక్టోబరు-నవంబరు తర్వాత నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలకు ఇంతవరకు పన్ను వేయలేదు. వారందరికీ ఒకేసారి పన్ను వేయనున్నారు.
* రిజిస్ట్రేషన్‌ విలువలు సవరించినప్పుడల్లా వాత తప్పదు..!
* కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.198లో... ఆస్తి మూలధన విలువలో నివాస భవనాలకు 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు, వాణిజ్య భవనాలకు 0.20 శాతం నుంచి 2 శాతం వరకు పన్నుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ఆ పరిధిలో పన్ను శాతాన్ని నిర్ణయించుకునే అధికారాన్ని పాలకమండళ్లకు వదిలేసింది. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో నివాస భవనాలకు 0.13 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతంగా, అనంతపురం వంటి నగరాల్లో నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతంగా పన్ను నిర్ణయించింది.
* ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించిన ప్రతిసారీ ఆ మేరకు పన్ను మొత్తం పెరుగుతూనే ఉంటుంది. పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అనేది ఇక నిరంతర ప్రక్రియ.
* పాత పద్ధతిలో ఐదేళ్లకు ఒకసారి ఆస్తి పన్ను సవరించాలన్న నిబంధన ఉన్నా అది అమలయ్యేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు సవరించారు. ఇకపై ఏటా పన్ను పెరుగుతూ పోతుంది.
* ఇప్పుడుకడుతున్న పన్నుపై మొదటి సంవత్సరం 15 శాతమే పెంచినా.. రానురాను మోయలేని భారంగా మారుతుందని పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details