విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ,' జాయిన్ ఫర్ డెవలప్ మెంట్ ఫౌండేషన్' ఛైర్మన్ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా కౌంటర్ వేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ త్వరలో తాము కౌంటర్ వేస్తామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది.
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, భూములిచ్చిన వారి బాగోగులను ఏవిధంగా పరిగణనలోకి తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొనలేదన్నారు. ప్రవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా అన్వేషించారా ? లేదా ? తెలపలేదన్నారు. కేంద్ర ఉక్కు పరిశ్రమ ఈ వ్యవహారంపై కౌంటర్ రూపంలో వైఖరి తెలపాలన్నారు. ప్రత్యేక కౌంటర్ అవసరం లేదని.. మొదటి ముగ్గురి ప్రతివాదుల తరపు కేంద్రం ఇప్పటికే కౌంటర్ వేసిందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఇదే అంశంపై దాఖలైన మరో పిల్లో సైతం కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం ఆదేశించింది.