ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court on New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు హైకోర్టులో విచారణ

High Court on New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన) పై.. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 8 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

High Court hearings on New Districts in Andhra Pradesh
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై నేడు హైకోర్టులో విచారణ

By

Published : Mar 14, 2022, 9:36 AM IST

Updated : Mar 14, 2022, 2:25 PM IST

High Court on New Districts: కొత్త జిల్లాల వ్యవహారంలో తుది ప్రకటన వెలువడని నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్లు చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ల కోసం జిల్లాలను యూనిట్‌గా పరిగణించాలని చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయని.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పూర్వ ప్రక్రియ మారిపోతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏముందంటే..

* కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371-డికి, ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్‌ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975కు విరుద్ధం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య సంబంధ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రజల హక్కులకు భద్రత కల్పిస్తూ ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 97లోనూ దీన్ని పొందుపరిచారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆరు సూత్రాల ప్రణాళిక ఉండేది. లోకల్‌ ఏరియాను నిర్ణయించడానికి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరు జోన్లుగా నిర్ణయించారు. స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించారు.

* ఆరు సూత్రాల ప్రణాళిక నేపథ్యంలో రాజ్యాంగంలో అధికరణ 371డి, 371ఈని పొందుపరిచారు. వాటి ప్రకారం ఏపీ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి.

* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్‌ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను తీసుకొచ్చారు. అందులోని రెండో షెడ్యూల్‌ ప్రకారం ఏపీలోని జిల్లాలను మొత్తం ఏడు జోన్లుగా ఏర్పాటు చేశారు. విభజన అనంతరం ఏపీలో 4 జోన్లు మిగిలాయి. కొత్త జిల్లాలతో వాటి స్వరూపం మారిపోతోంది.

* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్‌గా పరిగణించాలి. రాజ్యాంగ నిబంధనలను సవరించకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మార్చడానికి వీల్లేదు.

* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో లోయర్‌ డివిజన్‌ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాను యూనిట్‌గా పరిగణిస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదు.

* 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371డి తీసుకొచ్చి ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఈ నేపథ్యంలో జోన్ల సృష్టి, అందులో లోకల్‌ కేడర్‌ నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వతఃసిద్ధ అధికారం ఉండదు.

*వీటన్నింటి నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో జోన్లను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.

* ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి.

పిటిషనర్‌ ఏం చెప్పారంటే...

1. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాల హద్దులను నిర్ణయించారు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించనంత వరకు ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.

2. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి ఆరు సూత్రాల ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన వారికి అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడానికి అధికరణ 371డిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జోన్లకు విరుద్ధంగా కొత్త జిల్లాలను సృష్టించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేయకుండా అధికరణ 371డి(10) ప్రకారం నిషేధం ఉంటుంది.

3. ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 97లో.. అధికరణ 371డిని సవరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అని పేర్కొన్న స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొన్నారు. అంటే విభజన తర్వాత కూడా అధికరణ 371డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టమవుతోంది.

4. కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదు.

5. కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా స్థానిక అభ్యర్థులు అంటే ఎవరు? లోకల్‌ ఏరియా ఏమిటి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

6. 1975లో ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉత్తర్వుల్లో ప్రతి జిల్లాను లోకల్‌ ఏరియాగా పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 80శాతం రిజర్వేషన్లు కల్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్లు మారిపోతాయి. పూర్వ ప్రక్రియ అంతా మారిపోతుంది.

7.పునర్నిర్మాణ జిల్లాలు, డివిజన్లు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అది ఏపీ జిల్లా(ఏర్పాటు) చట్టం-1974 నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ చట్టప్రకారం అభ్యంతరాలను స్వీకరించి, పరిగణనలోకి తీసుకోవాలి. జనవరి 26న ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యంతరాల గురించి ప్రస్తావనే లేదు.

8. తుది నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ జిల్లా ఏర్పాటు చట్టం స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 8వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 3న మెమో జారీచేస్తూ పోస్టులను కేటాయించింది.

9. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారమై ఇప్పటికే గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.

10. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భారీగా అప్పుల్లో ఉంది. కేంద్రం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.

ఇదీ చదవండి:

Kharif Grain: నత్తనడకన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు..మార్చి వచ్చినా పూర్తి కాని లక్ష్యం

Last Updated : Mar 14, 2022, 2:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details