HIGH COURT: సుప్రీంకోర్టుతోపాటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి విశాఖలోని రుషికొండను తవ్వినట్లు తేలితే బాధ్యులైన అధికారులందరినీ కోర్టు ధిక్కారం కేసులో 6 నెలలు జైలుకు పంపుతామని హైకోర్టు హెచ్చరించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ (ఎంఓఈఎఫ్) ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించినా, గతంలో ఉన్న భవనాలను కూల్చిన స్థానంలోనే (5.18 ఎకరాలు) నిర్మాణాలను పరిమితం చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినా కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామంది. కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించింది. జిల్లా జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో కొలతలు తీయించి ఎంత మేరకు నిర్మాణాలు చేపట్టారో తేలుస్తామంది. ఆ మేరకు ఉత్తర్వులిచ్చేందుకు సిద్ధపడింది. ఈ సమయంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సీనియరు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానం (రిప్లై) ఇచ్చేందుకు సమయం కావాలని అభ్యర్థించడంతో విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలిచ్చింది.
అనుమతికి మించి తవ్వారని తేలితే.. చర్యలు తప్పవు: హైకోర్టు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
HIGH COURT: రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అనుమతికి మించి మైనింగ్ చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అడ్వకేట్ కమిషన్‌ను రుషికొండకు పంపిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలకు విరుద్ధంగా టూరిజం రిసార్టు పునరుద్ధరణకు రుషికొండపై తవ్వకాలు చేపట్టారని, చెట్లను కొట్టేస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున కేఎస్ మూర్తి, ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. 20 నుంచి 30 ఎకరాల వరకు కొండను తవ్వేశారని తెలిపారు. వ్యర్థాలను సముద్ర తీరాన కుమ్మరిస్తున్నారని, విశాఖ కలెక్టరు అందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సీనియరు న్యాయవాది సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. తాము తిరుగు సమాధానం ఇచ్చాక కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ తవ్వకాలు చేపట్టారని మొదటి నుంచీ పిటిషనర్లు చెబుతూనే ఉన్నారని, ఆ విషయం అధికారులు మీ దృష్టికి తీసుకురాకపోయి ఉండవచ్చని సింఘ్వీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పరిశీలించాలని సూచించింది. 5.18 ఎకరాలకు మించి నిర్మాణాలు జరిపితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇవీ చదవండి: