ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ చెత్తకు... మీరే బాధ్యులంతే! - చెత్త

వేల సంఖ్యలో సిబ్బంది.. కోట్ల రూపాయల వ్యయం.. నిత్యం వందల సంఖ్యలో ట్రిప్పులు.. టన్నుల కొద్దీ చెత్త తరలింపు.. అయినా కొండలా పేరుకుపోతున్న చెత్త.. ఇదీ విజయవాడ నగర దుస్థితి. అమరావతి రాజధాని ఆర్థిక నగరంగా ఎదుగుతున్న విజయవాడను చెత్త సమస్య ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్, బిన్ ఫ్రీ నగరంగా మార్చాలని సంకల్పించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. ఎవరి చెత్తను వారే ఎరువుగా మార్చుకుంటూ కాస్త సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

varmi_compost_vijawada_city

By

Published : Jun 17, 2019, 8:02 AM IST

మీ చెత్తకు... మీరే బాధ్యులంతే!

రాష్ట్ర విభజన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న విజయవాడ నగరంలో చెత్త నిర్వహణ తలకుమించిన భారంగా మారుతోంది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్​ అంటూ నగరంలోని 40 డివిజన్లలో ఈ విధానం అమల్లో ఉంది. ఇందుకోసం ఎన్ని పథకాలు అమలుచేస్తున్నా ఫలితం శూన్యం. ప్రణాళికా లోపం, పౌరస్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే నగర పాలక సంస్థ అధికారులు జనం సహకారంతో పరిష్కారం ఆలోచించారు.

కంపోస్టుగా తయారు చేసుకోవాలి
అపార్టుమెంట్లు, హోటళ్ల నిర్వాహకులకు విజ్ఞప్తి చేసి వదిలేయకుండా....కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ-2016 చట్టం ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వారి ఇళ్ల దగ్గరే విభజించి నగరపాలక సిబ్బందికి అందజేయాలి. అలాగే 20 ప్లాట్లకు పైబడిన అపార్టుమెంట్ నిర్వాహకులు రోజూ వారీ చెత్తను తడి, పొడిగా విభజించి తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. నగర పరిధిలో ఉన్న 100 కేజీలు పైబడి చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు, కల్యాణ మండపాలు, విద్యా, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కువ మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసే వారు కచ్చితంగా తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సవాలు అదిగమించాలంటే
నగరంలో నిత్యం 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా....అందులో దాదాపు 200 టన్నుల తడి చెత్త కాగా, మిగిలినది పొడి చెత్త. సేకరణ నగర పాలక సంస్థకు సవాలుగా మారింది. పెద్ద ఎత్తున సిబ్బందిని విధుల్లో ఉంచినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇలా నగరంలోని చెత్త మొత్తం డంపింగ్ యార్డులకు పోతోంది. చెత్తను రీసైకిల్ చేసే విధానం లేకపోవడంతో నగరం నుంచి తీసుకెళ్లిన చెత్త కొండలా పేరుకుపోతోంది.
నగర వాసులు తడి, పొడి చెత్తను వారి ఇంటి వద్దే వేరు చేసి సిబ్బందికి ఇవ్వడం ద్వారా నగర పాలక సంస్థకు చెత్త నిర్వహణ సులభతరం కానుంది. ముఖ్యంగా ఎవరికి వారు తమ ఇంటి వద్దే తడి చెత్తను ఎరువుగా మార్చి వాడుకుంటే...కాస్తలో కాస్త చెత్త ఉత్పత్తి తగ్గుతుంది.

ABOUT THE AUTHOR

...view details