heavy rush at antarvedi: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సాగర తీరానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవాన్ని తిలకించిన భక్తులు, తెల్లవారుజాము నుంచే సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భీష్మ ఏకాదశి పర్వదినాన పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే స్నానాలు చేసి, తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది.
సాగర సంగమానికి పోటెత్తిన భక్త జనం అంగరంగ వైభవంగా కళ్యాణం..
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. వివాహ మహోత్సవ ఘట్టాల్ని శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నరసింహుని పరిణాయోత్సవాన్ని అశేష భక్తజనం తిలకించి పులకించారు.శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఉత్సవ మూర్తుల్ని కళ్యాణ మండపంలో ప్రతిష్ఠింపజేశారు. విశ్వక్షేణ ఆరాధన, కన్యాదానం, పుణ్యాహవచనం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఇలా వివాహ క్రతువుల్ని కన్నుల పండువగా జరిపించారు. సరిగ్గా 12 గంటల 25 నిమిషాల సుముహుర్తంలో స్వామికి, అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలు రమణీయంగా నిర్వహించారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి వేణుతోపాటు అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు, కలెక్టర్, ఎస్పీ దంపతులు హాజరయ్యారు. ఈ కళ్యాణానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఇదీ చదవండి:
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి సర్వం సిద్ధం