గుజరాత్ హెరాయిన్ కేసులో డొంక కదులుతోంది. దిల్లీ వ్యక్తినే సూత్రధారిగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొందరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలో కంపెనీ ప్రారంభించిన సుధాకర్‌ను విచారిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించారని ఆరోపణలు వస్తున్న క్రమంలో.. హెరాయిన్ వ్యవహారంతో విజయవాడకు సంబంధం లేదని పోలీసులు అంటున్నారు.
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్లు విలువైన హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా దిల్లీ చేర్చాలనేది మాఫియా వ్యూహమని అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలకు అనుమానం రాకుండా విజయవాడ చిరునామాతో కంపెనీ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి వాసి సుధాకర్‌ను పావుగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుధాకర్ భార్య పేరుతో ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించినట్లు కనుగొన్నారు.
జూన్‌లో టాల్కం పౌడర్ ముసుగులో హెరాయిన్ దిగుమతైనట్లు అధికారులు గుర్తించారు. దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకూ హెరాయిన్ తరలించినట్లు చెబుతున్నారు. ఐదు రోజుల కిందట సుధాకర్ దంపతులను డీఆర్ఐ అదుపులోకి తీసుకొంది. సుధాకర్ సమాచారం ఆధారంగా అహ్మదాబాద్, దిల్లీ సహా చెన్నైలో సోదాలు చేశారు. సుధాకర్ దంపతులతో పాటు మరికొందరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.