క్రిస్మస్ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంకలో రాష్ట్రంలో కెల్లా అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేశారు. ఏటా కిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఈ స్టార్ కాంతులు వెదజల్లుతుందని స్థానికులు చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ మండలాల్లోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చీలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులు.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోకమంతా శాంతి, ఆరోగ్యం ప్రసాదించాలని వేడుకున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం ప్రాంతాల్లో కన్నుల పండుగగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. చీరాల పట్టణంలోని పలు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. యేసు జననాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మలు ఆకట్టుకున్నాయి. విశాఖలోని క్రిస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో ఏర్పాటు చేసిన బాల యేసు రూపాలు ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.