పవిత్ర రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన శుభ సందర్భంగా.. రంజాన్ పర్వదినం నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగాల తరబడి మన సమాజంలో ఒక అంతర్భాగంగా ఉన్నాయన్నారు. పవిత్ర రంజాన్ అనేది దేవునిచే నిర్దేశించబడిన జీవిత సాఫల్యాన్ని మనకు గుర్తు చేస్తుందని.. కఠినమైన స్వీయ క్రమశిక్షణ ద్వారా మాత్రమే జీవిత సారాన్ని గ్రహించడం సాధ్యమవుతుందని తెలియచేస్తుందని చెప్పారు.
ఈ పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ రోజున మానవ జీవితపరమావధిని, పవిత్రతను, విశ్వాసాలను, నమ్మకాలను గౌరవించే సాంప్రదాయాన్ని గుర్తుచేస్తుందన్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం కొనసాగించడం, ఎల్లప్పుడూ చేతులు శుభ్రపరచుకోవడం వంటి కోవిడ్ నివారణ సూత్రాలను అందరూ ఖచ్చితంగా పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ క్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని, 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని.. అనుమానాలు వీడాలని పిలుపునిచ్చారు.