ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీలింగ్‌ భూములపై సర్కారు కన్ను... విజయవాడలో 1205 మందికి నోటీసులు - ap latest news

పట్టణ భూపరిమితుల చట్టం కింద సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లు మొదలయ్యాయి. విజయవాడలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. 36 జీవో ఆధారంగా విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లోని సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.

భవనాలు
భవనాలు

By

Published : Feb 28, 2022, 4:52 AM IST

పట్టణ భూపరిమితుల చట్టం కింద సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లు మొదలయ్యాయి. భూముల బేసిక్‌ విలువపై ఒకటిన్నర రెట్ల చొప్పున చెల్లించాలంటూ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో ప్రభుత్వం నోటీసులిస్తోంది. దరఖాస్తు సమర్పించే సమయంలోనే 50% చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆ భూములపై దశాబ్దాలుగా ఆధారపడ్డ పేద, మధ్యతరగతి వర్గాల్లో కలకలం రేగింది. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వసూళ్లు కొనసాగుతున్నాయి. విజయవాడలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే నగరంలో మళ్లీ పట్టణ భూపరిమితుల చట్టం కింద 1,205 మందికి నోటీసులిచ్చే ప్రక్రియ మొదలైంది. రెవెన్యూ శాఖ గత నెల 31న జారీ చేసిన 36 జీవో ఆధారంగా విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లోని సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. గుంటూరులో ఈ పథకం కింద అర్హుల్ని గుర్తించి నోటీసులనిచ్చేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో పరిశ్రమలతోపాటు నిర్మాణాలూ ఉన్నాయి. విజయవాడ, చుట్టుపక్కలనున్న ఏడు మండలాల్లోనూ నోటీసులిస్తున్నారు.

విజయవాడ వాసి ఎం.సుబ్బారావు స్టేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఆయన ఎస్‌బీహెచ్‌ గృహనిర్మాణ సంఘ సభ్యుడిగా చేరి 1955లోనే స్థలం కొనుక్కున్నారు. ఇల్లు నిర్మించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులొచ్చాయి. ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం కింద ఆక్రమిత స్థలంలో నివసిస్తున్నారని, దాని మార్కెట్‌ విలువకు ఒకటిన్నర రెట్లు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తాజాగా నోటీసులిచ్చారు. అక్కడ గజం స్థలం విలువ రూ.60 వేల వరకు ఉంది. అంటే గజానికి రూ.90 వేల చొప్పున 300 గజాల స్థలానికి రూ.2.7 కోట్లు చెల్లించాలి. ఇలా ఈ హౌసింగ్‌ సొసైటీలో మొత్తం 28 మంది స్థలాల యజమానులకు నోటీసులందాయి.

వందల కోట్ల ఆదాయంపై సర్కారు కన్ను

సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి గుర్తించిన భూములు విజయవాడ నడిబొడ్డున పలు ప్రాంతాల్లో ఉన్నాయి. వీరంతా 60 ఏళ్లకుపైబడే అక్కడ నివసిస్తున్నారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు నిర్మించుకున్నారు. ఒక్కోచోట రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.90 వేల వరకు ఉంది. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలోనూ కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన భూములకు నోటీసులిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ వసూళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

నోటీసు అందుకుంటే 50 శాతం కట్టాల్సిందే

నిర్దేశిత సర్వే నంబరులో కొంత విస్తీర్ణం మీ ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామని, దీని బేసిక్‌ విలువపై ఒకటిన్నర రెట్లు చెల్లించి సదరు భూముల్ని క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొంటున్నారు. సమాచారమందిన 30 రోజుల్లోగా మీ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయాలని, డీడీ/బ్యాంకు చెక్కు రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో 50% చెల్లించాలని సూచిస్తున్నారు. ఈ నోటీసుల్ని పట్టణ భూపరిమితి చట్టం కింద జిల్లా సంయుక్త కలెక్టర్‌, అధీకృత అధికారి పేరుతో ఆయా ప్రాంతాల తహసీల్దార్ల ద్వారా అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందాక మీ సొంత (ఆక్రమణదారుల) ఖర్చులతో రిజిస్ట్రేషన్‌ చేయించి సదరు భూమిని నిషేధిత జాబితా(22ఎ) నుంచి తొలగిస్తామని పేర్కొంటున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 30 గడువు అని తెలిపారు.

భారీగా బాదుడు

పట్టణ భూపరిమితుల చట్టం కింద సీలింగ్‌, మిగులు భూముల క్రమబద్ధీకరణకు 2008 జూన్‌లో 747 జీవో ఇచ్చారు. అదే ఏడాది అక్టోబరులో జారీ చేసిన 1480 జీవోలో బేసిక్‌ విలువకు రెట్టింపు చెల్లించాలని పేర్కొన్నారు. దీన్ని సవరించి కొత్త జీవో ఇవ్వాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెల 31న జారీ చేసిన జీవోలో క్రమబద్ధీకరణ మొత్తాన్ని బేసిక్‌ విలువకు ఒకటిన్నర రెట్లుగా నిర్ణయించారు. భూమి రిజిస్ట్రేషన్‌, నిర్మాణ అనుమతి పత్రాలు, విద్యుత్తు బిల్లు, నీటిపన్ను రశీదుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ బేసిక్‌ విలువపై ఒకటిన్నర రెట్లతో లెక్కిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ పరిశీలించాక సీసీఎల్‌ఏకు, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ప్రభుత్వ అనుమతి లభించాక మిగిలిన 50 శాతం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

మాకెలా వర్తిస్తుంది?: విజయవాడ వాసుల ప్రశ్న

విజయవాడ ఎస్‌బీహెచ్‌ కాలనీవాసులతో పాటు పటమటలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి నోటీసులిచ్చారు. కోనేరువారి వీధిలో ఉన్న కొంతమందికి అర్బన్‌ సీలింగ్‌యాక్టు కింద మిగులు భూముల్లో ఆక్రమణలో ఉన్నారని, వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని నోటీసులిచ్చారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుని బ్యాంకులనుంచి రుణాలు తీసుకున్న తమకు క్రమబద్ధీకరణ ఎందుకు వర్తిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ఎస్‌బీహెచ్‌ కాలనీ వాసులకు నోటీసులు ఇవ్వడాన్ని జేసీ కె.మాధవీలత దృష్టికి ‘ఈనాడు’ తీసుకెళ్లగా.. ఆ సర్వే నంబర్లు తమ వద్ద మిగులు భూమిగా ఉన్నాయని చెప్పారు. హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకుని అన్ని రుజువులుంటే పరిశీలిస్తామని అన్నారు. పటమట మండలం పరిధిలో కూడా మిగులు భూములు ఆక్రమించిన వారికి నోటీసులిచ్చామని పేర్కొన్నారు. నగరంలో 1205 మందికి నోటీసులిచ్చినట్లు చెప్పారు. జీవో 36 ప్రకారం నోటీసులిచ్చామని, తమ వద్దనున్న 22ఏ నిషేధిత భూముల జాబితా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్లు జరుపకూడదని సూచించారు. క్రమబద్ధీకరణ చేసుకుంటే యజమానులకు హక్కులు లభిస్తాయని, ఎప్పటికైనా వారికి ప్రయోజనముంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.. నేడు విడుదల చేయనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details