ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2021, 12:48 PM IST

ETV Bharat / city

విజయవాడ కొత్త ఆసుపత్రిలో సాధారణ సేవలు

విజయవాడ కొత్త ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు మొదలయ్యాయి. అత్యవసర విభాగం సేవలు... మరికొన్ని రోజుల్లో ఆరంభం కానున్నాయి.

General medical services
విజయవాడ కొత్తాసుపత్రిలో సాధారణ వైద్య సేవలు పున ప్రారంభం

విజయవాడ ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి (కొత్తాసుపత్రి)లో సాధారణ వైద్య సేవలు తిరిగి మొదలయ్యాయి. కొవిడ్ కారణంగా పది నెలలుగా ఈ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు నిలిపేసి... పూర్తిగా కరోనా సేవలు అందించారు. ప్రస్తుతం సాధారణ వైద్య సేవలతో పాటు.. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు ప్రారంభం అయ్యాయి. అత్యవసర విభాగం సేవలను మరో మూడు నాలుగు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర శస్త్రచికిత్సలను చేయడం ఆరంభించారు.

కొవిడ్​ సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రి పరిధికి తరలించిన.. చాలా వైద్యసేవలను ఇక్కడికి మార్చారు. ఓపీ వైద్య సేవలు కూడా ఇదే ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలో కొవిడ్ సేవల కోసం ఓ బ్లాక్ ను కేటాయించారు. ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నందున.. ఆర్థో సహా కొన్ని రకాల సేవలు ఆరంభించేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యాధికారులు చెపుతున్నారు.

గుండె, నరాలు, ఉదరకోశ సంబంధిత వైద్య చికిత్సలు, ఓపీ సేవలు ఆసుపత్రిలోని ఐదంతస్తుల సూపర్ స్పెషాల్టీ బ్లాక్​లో మొదలయ్యాయి. పీడీయాట్రిక్ సర్జరీ సహా మరో మూడు విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు.. ప్రస్తుతం లేని కారణంగా ఆ సేవలు ఆరంభించలేదు. అత్యవసర శస్త్రచికిత్సలను జనరల్ సర్జరీ వైద్య నిపుణులే చేస్తున్నారు. కొవిడ్​ సమయంలో ఆసుపత్రికి ఒక మూత్రపిండాల వైద్య నిపుణుడిని కేటాయించారు. ప్రస్తుతం అతని ఆధ్వర్యంలోనే డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.

ఆసుపత్రిలో ఓపీ సేవల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మూడు రకాల ఓపీ ప్రారంభించారు. ఒకటి కరోనా బాధితుల బ్లాక్ లో, మరొకటి సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయి. మూడోది గతంలో ఉన్న సాధారణ ఓపీ విభాగం. అత్యవసర శస్త్రచికిత్సలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 294 మంది రోగులు ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒకవైపు కొవిడ్ సేవలు అందిస్తూనే .. సాధారణ రోగులకు ఇన్ పేషెంట్ సేవలు అందిస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు.

ప్రసుత్తం ఇక్కడ 53 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది వరకు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. రోజు కొత్తగా మరో ఐదుగురు కొవిడ్ సోకి తీవ్రమైన లక్షణాలతో వచ్చి ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details