గోదావరి బోర్డు పరిధిలోకి మొదటి దశలో పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే వెళ్లనుంది. బోర్డు ప్రతిపాదనకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించగా నిర్వహణ బాధ్యతల అమలు ఇక లాంఛనమే కానుంది. మిగిలిన వాటిపై రెండు రాష్ట్రాలు ససేమిరా అన్నాయి. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతపై చర్చించారు. బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, బోర్డు ఉప సంఘం కన్వీనర్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఉపసంఘం అందజేసిన పలు ప్రాజెక్టుల నివేదికలు, ప్రతిపాదనలపై చర్చించారు. 14వ తేదీ నుంచి గెజిట్ అమల్లో(Gazette for Jurisdiction of KRMB & GRMB)కి రానున్న నేపథ్యంలో ప్రయోగాత్మక అమలులో భాగంగా మొదట పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు స్వీకరించనుంది. ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను ఇతర ప్రాజెక్టుల్లో అన్వయం చేస్తామని బోర్డు తెలిపింది.
చర్చించిన అంశాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ, తెలంగాణలు 85:15 నిష్పత్తిలో నిర్వహణ వ్యయం భరించనున్నాయి. రెండు రాష్ట్రాల సిబ్బందిని కూడా అప్పగించనున్నారు.
- సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర వాటాపై అనేకసార్లు కేంద్రానికి సీఎం లేఖ రాసినా..ఇప్పటికీ తేల్చలేదని పేర్కొంది. బోర్డు పరిధిలోకి వస్తే విద్యుత్ పంపిణీ అంశం తేలుతుందని సూచించింది. దీనికి ఏపీ అభ్యంతరం తెలిపింది.
- గోదావరి నదికి దిగువ రాష్ట్రం ఏపీ. వరద లేని సమయంలో దిగువకు పెద్దగా నీటి ప్రవాహం రావడం లేదు. పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కదానినే బోర్డు తీసుకుంటే పెద్దగా ఉపయోగం లేదని, ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను చేర్చాలని ఏపీ పేర్కొంది. ఇతర ప్రాజెక్టులను చేర్చే అంశంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
- బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు కేటాయించాలనే అంశంపై చర్చ జరిగింది. బడ్జెట్‌ను ఏ అవసరాలకు వినియోగిస్తారనేది స్పష్టత ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయి.
ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించాకే: తెలంగాణ.. ప్రాజెక్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యల పరిష్కార బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ తెలిపారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.