దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను సీఆర్డీఏ నిబంధనలు మార్చి... 1,250 ఎకరాలు వైకాపా కార్యకర్తలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. క్లిష్ట సమయంలో రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం దళారులకు కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. టమాటా, బొప్పాయి, మామిడి, మల్లె రైతులు... పండించిన పంటలను ఏమి చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
రైతులు పండించిన పంటను తరలించడానికి రవాణా వాహనాలు దొరకడం లేదు కానీ.. వైకాపా నాయకులు ఇసుక తరలించడానికి వందలాది లారీలు ఎలా వస్తున్నాయని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశించినా... ఆపత్కాలంలో సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు గానీ, శానిటైజర్లు గానీ ఎందుకు ఇవ్వలేక పోతున్నారని ఆక్షేపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాస్తవ పరిస్థితులను తెలపాల్సిన ముఖ్యమంత్రి జగన్.... రికార్డ్ వీడియోలు కట్టిబెట్టాలని.. మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.