కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 40 లంక గ్రామాలను గోదావరి జలాలు చుట్టుముట్టడంతో రాకపోకలు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పశ్చిమలంకలో 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలాచోట్ల ఉద్యాన పంటలు, నర్సరీ మొక్కలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం మద్దూరు లంకకు ముంపు ముప్పు ఎదురవగా.. గ్రామంతోపాటు, గట్ల పరిస్థితినీ అధికారులు సమీక్షించారు.
సురక్షిత ప్రాంతాలకు గర్భిణులు:ముంపు ప్రాంతాల్లోని 338 మంది గర్భిణులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. హైరిస్క్ గర్భిణులు 52 మందిని ఆసుపత్రులకు తరలించామని.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,970 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు.
ఎటపాక, కూనవరం అతలాకుతలం:భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాయనపేట, నెల్లిపాక, కన్నాయిగూడెం, మురుమూరు ప్రధాన, జాతీయ రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రాకపోకలు స్తంభించాయి. కూనవరం మండలంలో 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో 6,500 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దాదాపు 25,000 మంది నిరాశ్రయులైనట్లు చెప్పారు. దేవీపట్నం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొండమొదలు పంచాయతీలోని గ్రామాల ప్రజలు కొండలపైనే ఉంటున్నారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్దకు భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి- పూడిపల్లి గ్రామాలకు వరద నీరు పోటెత్తింది.
- జూరాల ద్వారా శ్రీశైలానికి చేరుతున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడైతేనే శ్రీశైలం జలకళ సంతరించుకోనుంది. తుంగభద్ర డ్యాం నుంచి బుధవారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పైగా విడుదల చేయడం ప్రారంభించారు. వరద శ్రీశైలం చేరుకోవడానికి 36 గంటల కన్నా ఎక్కువ సమయమే పట్టనుంది.
- గోదావరికి వరద ఉద్ధృతి మరింత పెరగనుందని.. గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్రస్థాయి సమాచార కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 1070, 1800 4250 101, 08632 377118 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నేడు, రేపు వర్షాలు:వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, రుతుపవన ద్రోణితోపాటు తూర్పు-పడమర గాలుల కోత నేపథ్యంలో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.