అక్టోబరు ఏడో తేదీ నుంచి 15 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. రోజుకు పది వేల మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. అందులో నాలుగు వేల మంది భక్తులకు ఉచితంగా... వంద రూపాయలు, మూడు వందల రూపాయల టిక్కెట్‌ల ద్వారా మూడు వేల మందికి దర్శనం కల్పించున్నారు. భక్తులు ఎవరైనా ముందుగా ఆన్‌లైన్ టిక్కెట్లు పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి కరోనా టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని భక్తులు తమవెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
నదీ స్నానాలు రద్దు..
నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు లిఫ్ట్ సౌకర్యాన్ని నిలిపివేయనున్నారు. భక్తుల కోసం వినాయకగుడి నుంచి టోల్‌గేట్ ద్వారా కొండపైన ఓం మలుపు వరకు మూడు వరుసల మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం నుంచి దిగువకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వరుసల్లో శానిటైజేషన్, థర్మల్‌గన్స్‌తో తనిఖీలు చేయాలని సూచించారు. కృష్ణానదిలో స్నానాలను నిషేధించారు. భక్తులు జల్లుస్నానాలు చేసుకునేందుకు వీలుగా సీతమ్మ వారి పాదాల వద్ద మూడు వందల షవర్లు ఏర్పాటు చేయనున్నారు. దుర్గాఘాట్ నుంచి భక్తులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.