విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ప్రతిఏటా దసరా ఉత్సవాలను సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తుంటారు. దసరా ఉత్సవాల్లో తొలి రోజైన ఈ రోజు అమ్మావారు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు స్వర్ణ కవచాన్ని ధరించి, దుష్టసంహారం చేసేందుకు సిద్దమైన రూపాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు. ఈ అవతారానికి పురాణాల్లో అత్యంత విశిష్టత వుంది.
రెండో రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపుర సందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. సమస్త దేవీ మంత్రాల్లో విశిష్టమైన బాలామంత్రంకు ఎంతో ప్రాధాన్యత వుంది. శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో బాలా త్రిపుర సందరీదేవి అధిదేవతగా పూజలందుకుంటోంది. అందుకే శ్రీవిద్యోపాసకులు ముందుగా బలామంత్రాన్ని ఉపదేశంగా పొందుతున్నారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు ఈ అమ్మవారి రూపాన్ని దర్శించుకుంటే పూర్ణఫలం లభిస్తుంది.
మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాల్లో నాలుగో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శమిస్తారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో... తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.
ఐదోరోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.