భారీ బడ్జెట్తో తీసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టం జరగదని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినట్లు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అలాగే ప్రేక్షకులపై కూడా భారం పడకుండా ఉండేలా టికెట్ ధరలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు రాజమౌళి వివరించారు. మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్యతో కలిసి నిన్న (సోమవారం) సీఎంను కలిసిన రాజమౌళి.. కొత్త జీవో వల్ల తలెత్తిన అయోమయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ జగన్కు వినతి పత్రం అందజేశారు.
ఈ విషయంపై హైదరాబాద్లో నిర్వహించిన 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమంలో స్పందించిన రాజమౌళి.. సీఎం జగన్కు అందజేసిన వినతి పత్రంలో ఎలాంటి రహస్యాలు లేవన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి టికెట్ ధరలు ఉంటాయని సీఎం తెలిపారన్నారు. అయితే ఇప్పటికే చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక వివాదాలు నెలకొన్నాయని..,మళ్లీ తాను మాట్లాడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు బెన్ఫిట్ షోలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ఐదో ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన క్రమంలో ప్రతిరోజూ ఒక షో బెనిఫిట్ షోనేనని రాజమౌళి స్పష్టం చేశారు.
"ఆర్ఆర్ఆర్ చిత్రం కోసమే నిన్న సీఎం జగన్‌ను కలిశాం. సీఎం జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశాం.అందులో ఎలాంటి రహస్యాలు లేవు. సినీ పరిశ్రమపై ఇప్పటికే చాలా వివాదం జరిగింది. మళ్లీ కొత్త వాటి జోలికి వెళ్లవద్దు. టికెట్ ధరలపై మాట్లాడితే మళ్లీ జనాలు నన్ను తిట్టుకుంటారు. ఆర్ఆర్ఆర్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారు. జీవో ప్రకారం టికెట్ ధరలు పెరుగుతాయన్నారు. కొత్త జీవో విడుదల తర్వాత కొంత అయోమయం నెలకొంది. సీఎంతో మాట్లాడాక అంతా బాగానే ఉంటుందని అనిపించింది. ఏపీ ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇచ్చింది."- రాజమౌళి, సినీ దర్శకుడు