Award to APSRTC: ఏపీఎస్ఆర్టీసీ మరో జాతీయస్థాయి అవార్డు సాధించింది. డిజిటల్ విధానాలను సమర్ధంగా అమలు చేస్తోన్నందుకు ఇచ్చే "డిజిటల్ టెక్నాలజీ సభ" అవార్డుకు వరుసగా నాలుగోసారి ఎంపికైన ఆర్టీసీ.. జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ సంస్థలతో పోటీ పడి అవార్డును సొంతం చేసుకుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టికెట్లను జారీ చేస్తూ విశేష ప్రగతి సాధించినందుకు డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు వరించింది. వర్చువల్ సెమినార్ ద్వారా ఈ పురస్కారాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అందుకున్నారు.
ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో డిజిటల్ విధానాలను సమర్థంగా అమలు చేసేందుకు అవార్డు ఇచ్చారు. రవాణా వ్యవస్థపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. భయంతో ప్రజలు టికెట్ కొని ప్రయాణాలు చేసేందుకు జంకేవారు. వారి భద్రత దృష్ట్యా డిజిటల్ పద్ధతిలో టికెట్లను విక్రయించాలని నిర్ణయించాం. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టికెట్లను జారీ చేశాం. 15 శాతం పేమెంట్స్ డిజిటలైజేషన్ ద్వారా చేశాం. దేశంలోనే మొదటిసారిగా ఏకరూప టికెట్ విధానాన్ని త్వరలోనే తీసుకొస్తాం.