Financial Burden on andhra pradesh : ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ముప్పుగా పరిణమించే స్థాయికి చేరుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రుణాలను తీర్చేందుకు మరో సంస్థ నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అన్ని రకాల చెల్లింపులు, అప్పులు కలిపి రాష్ట్రంపై ఉన్న ఆర్థిక భారం దాదాపు రూ.6.82 లక్షల కోట్లకు చేరిందని అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు అప్పుల కోసం ఇచ్చే గ్యారంటీల పరిమితిని పెంచుకోవడం చర్చనీయాంశమైంది.
Financial Burden on AP : రాష్ట్రంపై ఆర్థిక భారం రూ.6.82 లక్షల కోట్లు? - రాష్ట్రంపై ఆర్థిక భారం రూ.6.82 లక్షల కోట్లు?
రాష్ట్రానికి అప్పులు ముప్పుగా (Financial Burden on AP) పరిణమించే స్థాయికి చేరుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణాలు తీర్చేందుకు మరో సంస్థ నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మొత్తంగా ఇవీ అప్పులు
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రజారుణం (పబ్లిక్ డెట్) రూ.3,87,125.39 కోట్లకు చేరుతుందని అంచనాలు వేసింది. ఇది మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు.
* రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి రుణాలు పొందింది. ఆ మొత్తం రూ.1.25 లక్షల కోట్ల వరకు ఉంది. బడ్జెట్‌లో చూపని ఈ అప్పులు తీర్చేందుకే ప్రతి ఏటా రూ.10వేల కోట్లపైనే చెల్లించాల్సి వస్తోంది.
* ఇటీవల ప్రభుత్వం స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు సేకరిస్తోంది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి స్వీకరించిన మొత్తం రూ.5,000 కోట్ల వరకు ఉంది.
* సీఎఫ్‌ఎంఎస్ ప్రకారమే... గుత్తేదారులు, సరఫరాదారులకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు బకాయి పడింది. వీటితోపాటు లెక్కల్లో చూపని బకాయిలతోపాటు ఉద్యోగులకు పెండింగు ఉన్న బిల్లులు, డీఏ బకాయిలు తదితరాలన్నీ కలిపితే వీటన్నింటి భారం రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా.
* ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వకుండా వివిధ ఇంధన సంస్థలు తీసుకున్న రుణాలు రూ.65,233 కోట్లుగా ఉన్నట్లు లెక్క. ఈ మొత్తాలన్నీ కలిపితే ప్రభుత్వంపై రూ.6.82 లక్షల కోట్ల భారం ఉన్నట్లు అంచనా.
రాష్ట్రంలో పరిస్థితులు
* విద్యుత్తు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన రుణ బకాయిల కోసం సాక్షాత్తూ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్దలే రాష్ట్రానికి వచ్చి చర్చలు జరిపారు. బకాయిలు చెల్లించకుంటే... ఆయా ప్రభుత్వ సంస్థలను నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేర్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఎస్‌బీఐ నుంచి రూ.1,500 కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో కాగ్ సైతం రుణాలు చెల్లించేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.
* విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న ప్రాజెక్టుల్లోనూ బిల్లుల చెల్లింపులు సాగడం లేదని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన నిధులూ వేరే వాటికి మళ్లించడంతో వారు ఆగ్రహించి ప్రాజెక్టులకు సాయం నిలుపుదల చేస్తామని హెచ్చరిస్తున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య, ఉద్యోగ విరమణ, గ్రాట్యుటీ, ఏపీజీఎల్‌ఐ బిల్లుల చెల్లింపులు సవ్యంగా సాగడం లేదు.
* వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాల అద్దెల బిల్లుల చెల్లింపులూ సాగడం లేదు
* వివిధ నిర్మాణాలకు అనేకచోట్ల టెండర్లు పిలుస్తున్నా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రావడం లేదు.
ఇదీ చదవండి:ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొదని బెదిరింపు