బడ్జెట్ సమావేశాలంటే కనీసం 40 నుంచి 50 రోజులు పాటు జరగడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఈ సమావేశాలను రెండు రోజులపాటు నిర్వహించడం ఏదో సినిమా ట్రైలర్ లా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు.
ఇలాంటి గవర్నర్ అవసరం లేదు....
బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి కానీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇలా ప్రముఖులందరూ హాజరైన సభకు గవర్నర్ హాజరుకాకుండా తన అధికార బంగ్లా నుంచే మాట్లాడటం శోచనీయమన్నారు. గవర్నర్ అంటే సీఎం జగన్ పంపే తప్పుడు ఆర్డినెన్సులను ఆమోదించడమేనా ఆయన పని అని నిలదీశారు. చట్టసభలను అవమానించిన ఇలాంటి గవర్నర్ అవసరం లేదని మండిపడ్డారు.
ప్రాధాన్యత రంగాలకు తగ్గిన కేటాయింపులు...
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్రెడ్డి 2.24 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రజలను మోసం చేయడమేనని రామకృష్ణ తెలిపారు. కరోనాతో... రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగంతో సహా అన్నీ కుదేలై జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో... ప్రభుత్వం ఇంత ఆదాయాన్ని ఎలా సమకూరుస్తుందో ఆర్థికమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా ప్రాధాన్యతా రంగాలైన నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు తగ్గించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం చేస్తామంటున్న ప్రభుత్వం అభివృద్ధి రంగాలకు నిధులు కేటాయించడంలో విఫలమైందని విమర్శించారు.
ఈస్టమన్ కలర్ సినిమా చూపించారు...
గతేడాది గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదని రామకృష్ణ దుయ్యబట్టారు. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఓ హంబక్ గా నిలిచాయని తెలిపారు. గవర్నర్ హాజరు కాకుండా సభలను అవమానించారని...వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు ఈస్టమన్ కలర్ సినిమా చూపించారన్నారు. ప్రజలందరూ వ్యతిరేకించిన మూడు రాజధానుల ప్రస్తావన తేవడం ప్రభుత్వ మొండితనాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విజ్ఞత ప్రదర్శించి మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు అవసరమా?