ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన

CPI protests: నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో 'చలో అమరావతి' కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష నాయకులను అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు.

CPI protests
రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నిరసన

By

Published : May 9, 2022, 12:58 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నిరసన

Protests: నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా... సీపీఐ తలపెట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీపీఐ నేతలు కోనాల భీమారావు, బొద్దాని నాగరాజులను గృహనిర్బంధం చేశారు. గృహనిర్బంధం చేయటం పట్ల సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం ద్వారానే ఉద్యమాలను ఆపగలరని... కోనాల భీమారావు అన్నారు.

అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి సీపీఐ నేత రామకృష్ణ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి సప్తగిరి కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.

అనంతపురం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో పలువురు వామపక్ష నాయకులను అరెస్టు చేశారు. చలో సచివాలయానికి వెళ్తుండగా నిన్న రాత్రి సీపీఐ నేత రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వేస్టేషన్‌కు ర్యాలీగా వెళ్తుండగా రామకృష్ణను అడ్డుకున్న పోలీసులు... అనంతపురం, కూడేరు పోలీసుస్టేషన్లకు రామకృష్ణను తిప్పారు. అర్ధరాత్రి తర్వాత సీపీఐ నేత రామకృష్ణను విడుదల చేశారు.

ధరల మోతపై నిరసనలు చేపడితే అడ్డుకోవడం దుర్మార్గమని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తూ... నిరసనలపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయాలంటూ పార్టీ నేతలతో కలిసి అనంతపురంలో రామకృష్ణ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎంతమంది పోలీసులను పెట్టినా.. కచ్చితంగా చలో సెక్రటేరియట్ నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు.

"రాష్ట్రంలో అంబేడ్కర్​ రాజ్యాంగం అమలులో ఉందా లేక జగన్​రెడ్డి కొత్తగా రాజ్యాంగం ఏమైనా రాసుకున్నారా. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఉద్యోగ సంఘాలనే కాదు వ్యవసాయ కార్మిక సంఘాలను కూడా విజయవాడకు రానివ్వడంలేదు. పెరిగిన ధరలు తగ్గించాలి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని మేము చేపట్టిన నిరసనకు పోలీసుల అనుమతి కూడా కోరాం. అనుమతించకుండా 26 జిల్లాలో గృహనిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి అంబేడ్కర్​ రాజ్యాంగం అమల్లో లేనందువల్ల.. రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నాం."- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద సీపీఎం నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం డిమాండ్‌ చేశారు. గ్యాస్ ధరలు తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. సీపీఎం నేత సి.హెచ్‌.బాబూరావుతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

రోజురోజుకు నిత్యావసరాల ధరలను పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారని....పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్​ చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులు, గృహ నిర్భందాలు చేయడం దుర్మార్గమని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్ వద్ద పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. పెంచిన గ్యాస్ నిత్యావసరాల ధరలను తగ్గించే వరకు తమ పోరాటం ఆపేది లేదని శంకర్ స్పష్టం చేశారు.

అధిక ధరలు, పన్నులకు వ్యతిరేకంగా చలో సచివాలయానికి సీపీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో గొల్లపూడిలోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ను గృహనిర్బంధం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details