ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 1:04 PM IST

ETV Bharat / city

కార్తిక తీర్థయాత్రలకు.. కరోనా గ్రహణం

ముక్కంటికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తిక సోమవారం నాడు శైవక్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు. ఈసారి కార్తిక మాసంలో పరిస్థితి మారింది. మహిళలు, వృద్ధులు చాలా మంది ఇళ్లకే పరిమితమవతున్నారు. ఈ కారణంగా శైవక్షేత్రాలకు ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు ప్రయాణికులు లేక రద్దు అవుతున్నాయి.

తీర్థయాత్రలపై కరోనా ప్రభావం
తీర్థయాత్రలపై కరోనా ప్రభావం

తీర్థయాత్రలపై కరోనా ప్రభావం పడింది. పరమ శివుడికి ఎంతో నిష్ఠతో కార్తీక మాసంలో పూజలు చేస్తారు. ముక్కంటికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తిక సోమవారం నాడు శైవక్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు. ఈసారి కార్తిక మాసంలో పరిస్థితి మారింది. మహిళలు, వృద్ధులు చాలా మంది ఇళ్లకే పరిమితమవతున్నారు. ఈ కారణంగా శైవక్షేత్రాలకు ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు ప్రయాణికులు లేక రద్దు అవుతున్నాయి. గత ఏడాది కిటకిటలాడిన సర్వీసులు, ఈదఫా ఒకటీ, అరా మాత్రమే నడుస్తున్నాయి.

ప్రయాణికుల అనాసక్తి

కృష్ణా రీజియన్‌ నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు వేశారు. గత సోమవారం నుంచి నడిపేందుకు షెడ్యూలు విడుదల చేశారు. జిల్లా నుంచి ప్రముఖ శివాలయాలకు దాదాపు 200 వరకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రచించారు. పంచారామాల ప్యాకేజీ కింద ఒకే రోజులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కలగనుంది. కర్నూలు జిల్లా యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి వచ్చేలా త్రిలింగ దర్శిని ప్యాకేజీని కూడా రూపొందించారు.

విజయవాడతో పాటు జిల్లాలోని ప్రధాన డిపోల నుంచి తిరుగుతాయని ప్రకటించారు. ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినా ఫలితం లేకపోయింది. 16న కార్తిక మాసం తొలి రోజున నడవాల్సిన బస్సులు రద్దు చేశారు. విజయవాడ నుంచి కేవలం రెండు బస్సులకు, అదీ రెండేసి చొప్పున మాత్రమే బుక్‌ అయ్యాయి. 22న సగం మందితో కేవలం ఒకటి మాత్రమే బయలుదేరింది. 23వ తేదీకి ఓ మోస్తరుగా రిజర్వు అయ్యాయి.

రెండో దశపై భయం

చలికాలం మొదలు కావడం, కరోనా రెండో దశ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కార్తిక మాసం సందర్భంగా వీలైనంత వరకు ఆలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఇటీవల స్వయంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శీతాకాలంలో వైరస్‌ తిరగబెట్టే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని నగరాల్లో తిరిగి లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. జిల్లాలో కరోనా బారిన పడి మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ఈ నేపథ్యంలో తీర్థయాత్రలకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఈసారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్యాకేజీల్లో భాగంగా ఎక్కువ ఆలయాలను దర్శించుకోవడం, బయట ప్రాంతాల్లో అల్పాహారాలు, భోజనాలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందితో కూడుకున్నదని భావిస్తున్నారు.

గత ఏడాది కిటకిట

2019 కార్తిక మాసంలో జిల్లాలోని పలు డిపోల నుంచి ప్రముఖ ఆలయాలకు 227 బస్సులు నడిపారు.ఇందులో పంచారామాలకే 102 సర్వీసులు తిరిగాయి. ప్రయాణికుల నుంచి భారీగా డిమాండ్‌ ఉండడంతో ఒక్క విజయవాడ నుంచే 84 వెళ్లాయి. త్రిలింగ దర్శినిలో 10, శ్రీశైలం.. 47 బస్సులు నడిచాయి. మొత్తం 1.36 లక్షల కి.మీ తిప్పారు.వీటి ద్వారా రూ.61,64,870 మేర ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. ఓఆర్‌ అయితే ఏకంగా 102 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details