ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: దయనీయంగా ఆటోవాలాల జీవితాలు

కరోనా విజృంభనతో ఆటోవాలాల పరిస్ధితి దారుణంగా తయారైంది. లాక్​డౌన్​లో అష్టకష్టాలు పడిన వేలాది కుటుంబాలు ఆ తర్వాతనైనా కష్టాలు తీరుతాయని ఆశించినా..వారి ఆశ నిరాశే అయింది. కరోనా సెకండ్ వేవ్​ బడుగు జీవుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతోంది. కరోనా వ్యాప్తితో అందరూ వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యతనిస్తుండటంతో ఆటోవాలాల పరిస్థితి దయనీయంగా మారింది.

By

Published : Apr 18, 2021, 10:28 PM IST

corona effect on auto drivers
దయనీయంగా ఆటోవాలాల జీవితాలు

రవాణా రంగంలో ఆటోలది కీలకపాత్ర. నగరాల్లో ప్రయాణ అవసరాలను తీర్చుతూ..ఆటోవాలాలు సేవలందిస్తున్నారు. ఆటోలపై ఆధారపడి వేలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం వరకు సాఫీగా సాగిన ఆటోవాలాల జీవితాలు కరోనా వైరస్​తో తలకిందులయ్యాయి. గతేడాది మార్చిలో లాక్​డౌన్​తో వేలాది ఆటోవాలా కుటుంబాలు అతలాకుతమలమయ్యాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులు, అప్పుల బాధతో చాలా మంది ఆటోవాలాలు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. లాక్​డౌన్ అనంతరం పరిస్థితులు కాస్త మెరుగుపడగా...ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి తేరుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చిన కరోనా సెకండ్ వేవ్ ఆటోవాలాల జీవితాలను తిరిగి కష్టాల పాల్జేసింది.

తగ్గిన ప్రయాణికులతో పూట గడవని పరిస్థితి

రవాణా రంగం హబ్​గా పేరొందిన విజయవాడలో పదివేలకు పైగా ఆటోలు తిరుగుతుంటాయి. అతి పెద్ద బస్టేషన్, రైల్వే జంక్షన్లు నగరంలో ఉండటంతో పెద్దఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటోవాలాలది కీలక పాత్ర. కరోనా దెబ్బకు రైళ్ల రాకపోకలు, బస్సుల సంఖ్య కుదించటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆటోవాలాల జీవనోపాధికి గండి పడింది. వచ్చే కొద్ది మంది ప్రయాణికులూ కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల, క్యాబ్​లను ఆశ్రయిస్తుండటంతో ఆటోవాలాలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది.

ఆత్మహత్యలే శరణ్యం

గతంలో రోజుకు వెయ్యికి పైగా సంపాదించేవారమని, కరోనా దెబ్బతో రోజంతా కష్టపడినా...రెండు, మూడొందలకు మించటం లేదని ఆటోవాలాలు వాపోతున్నారు. దీనికితోడు.. పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామన్నారు. పిల్లలను చదువులు మాన్పించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

గాల్లో దీపంగా జీవితాలు..

కరోనా సెకండ్ వేవ్​తో గిరాకీలు లేకపోగా..తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయం భయంగా బతకాల్సి వస్తోందని వాపోతున్నారు. మాస్కులు ధరించటం, ఆటోలో ప్రయాణికులకు అడ్డంగా పాలిథిన్ షీట్ ఏర్పాటు, శానిటైజర్ వినియోగం లాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..చాలామంది ఆటోవాలాలు కరోనా బారిన పడి చనిపోయినట్లు చెబుతున్నారు. కొందరు కొవిడ్ పేషంట్లు ఆటోలను ఆశ్రయిస్తుండటంతో తమ జీవితం గాల్లో దీపంగా మారిందంటున్నారు. తమ కష్టాలు ఎప్పుడు కడతేరుతాయా అని వేలాది మంది ఆటోవాలాలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇదీచదవండి

కరోనా కలవరం...కొత్తగా 6,582 కేసులు, 22 మరణాలు

ABOUT THE AUTHOR

...view details