కరోనా ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో విజయవాడలో కఠిన ఆంక్షల అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. నగరంలో మొత్తం 64 వార్డులున్నాయి. వీటిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న 42 వార్డులను కంటెయిన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. వన్‌టౌన్ మార్కెట్ సహా రద్దీ ప్రాంతాల్లో దుకాణాలన్నింటినీ బుధవారం మూయించారు. కృష్ణాజిల్లాలో ఇప్పటివరకూ 635 పాజిటివ్ కేసులు నమోదైతే, వీటిలో 500కు పైగా విజయవాడలోనే ఉన్నాయి. గత ఐదు రోజుల్లోనే జిల్లాలో వరుసగా.. 25, 25, 19, 28, 37 చొప్పున మొత్తం 134 కేసులు నమోదవ్వగా.. విజయవాడలోనే 110 వచ్చాయి. జూన్ నెల ఆరంభం నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపార సముదాయాల వద్ద జాగ్రత్తలు చేపట్టకపోవడం, వ్యాపారులు మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించే ఏర్పాట్లు లేకపోవడంతో.. కేసుల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోతోంది. విజయవాడలోని కృష్ణలంక, వన్‌టౌన్, జక్కంపూడి, సింగ్‌నగర్, మాచవరం ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్లుగా మారాయి. ఈ ప్రాంతాల్లో కేసుల ఉద్ధృతి ఆగడం లేదు.
విజయవాడలో తాజాగా వస్తున్న పాజిటివ్ కేసుల్లో చిరు వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు, పనిచేసేవాళ్లు అధికంగా ఉంటున్నారు. ఓ కిరాణా వ్యాపారి, పండ్లరసం దుకాణదారుడు, డెయిరీ ఉత్పత్తులు అమ్మే వ్యక్తి.. ఎక్కువ మంది ఇలాంటివారే ఉంటున్నారు. వీరితో పాటు కుటుంబం మొత్తం పాజిటివ్ బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. మెడికల్ షాపులు నిర్వహించేవారిలోనూ సగం మందికి మాస్కులే ఉండట్లేదు. వీళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ప్రతి వ్యాపారి వద్దకు నిత్యం వందల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తారు. వీరిలో ఎవరికి వైరస్ ఉన్నా.. వ్యాపారులకు సులువుగా వ్యాపిస్తుంది. సరకులు, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సమయంలో ప్రమాదం పొంచి ఉంటుంది. అయినా.. వ్యాపారుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.