Condolence to Rosaiah: మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. రోశయ్య, తాను ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు అనుబంధం ఏర్పడిందని చెప్పారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నానని మోదీ చెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. రోశయ్య పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని అన్నారు. ప్రజానేత ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన రోశయ్య.. తనకు చిరకాల మిత్రుడని అన్నారు.
రోశయ్య భౌతికకాయానికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నివాళులు అర్పించారు. రోశయ్య మరణం తెలుగుప్రజలకు తీరని ఆవేదన కలిగిస్తోందని అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం, గవర్నర్ స్థాయికి రోశయ్య ఎదిగారని సీజేఐ అన్నారు. కళలు, సంస్కృతికి పెద్దపీట వేశారని కొనియాడారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ సైతం రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావును ఫోన్‌లో సోనియా, రాహుల్ పరామర్శించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.