ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై.. - Colonel Santosh Babu father latest news

తండ్రి కోరికను నెరవేర్చాలి.. దేశసేవలో తరించాలి.. అందుకోసం చిన్ననాటి నుంచే కఠోర శ్రమ.. నిరంతర సాధన.. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉండడానికి సిద్ధపడి సైనిక్‌స్కూల్లో చేరారు.. పట్టుదలతో కృషి చేసి సైన్యంలోకి ప్రవేశించారు. అంచలంచెలుగా ఎదిగి పిన్నవయసులోనే కర్నల్‌ స్థాయికి చేరారు.. చివరకు దేశమాత కోసం ప్రాణాలర్పించారు సంతోష్​ బాబు..

Colonel Santosh Babu dead in india, china border
Colonel Santosh Babu dead in india, china border

By

Published : Jun 17, 2020, 7:19 AM IST

భారత్‌ - చైనా సరిహద్దులో అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు వీరగాథ ఇది. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు (39) అమరుడవడంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతోష్‌ 16వ బిహార్‌ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌, తల్లి మంజుల, భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు. సంతోష్‌ 2004లో లెఫ్టినెంట్‌ హోదాలో సైన్యంలో చేరారు. శ్రీనగర్‌, కుప్వారా, లద్దాఖ్‌లలో పనిచేశారు.

అంచెలంచెలుగా ఎదిగి 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. కొన్నాళ్లు కాంగోలో మన దేశం తరఫున విధులు నిర్వర్తించిన సంతోష్‌ 37 ఏళ్ల వయసులోనే కర్నల్‌ హోదా పొందారు. ఆయన చివరిసారిగా గతేడాది మార్చిలో సూర్యాపేటకు వచ్చారు. రెండ్రోజుల క్రితం చెల్లెలు శ్రుతి పెళ్లిరోజు కావడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

కర్నల్‌ అమరుడయ్యారన్న వార్త తెలియగానే సూర్యాపేట పట్టణంలో ఆయన తల్లిదండ్రులు నివాసముండే విద్యానగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు బంధువులు వారిని పరామర్శించారు. సంతోష్‌బాబు భార్య సంతోషి ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. కర్నల్‌ అమరుడైన విషయాన్ని ఆర్మీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆమెకు తెలియజేశారు. అత్తమామలు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని భావించిన సంతోషి మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

చొరబాటుదారుల ఏరివేత..

కర్నల్‌ సంతోష్‌బాబు జమ్మూ, కుప్వారా, శ్రీనగర్‌, పూంచ్‌ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2007లో పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పనిచేస్తున్నప్పుడు కుప్వారా వద్ద ముగ్గురు చొరబాటుదారులను కాల్చిచంపారు. భారత సైన్యం ఆయన ధైర్యానికి మెచ్చి పదోన్నతినిచ్చి సత్కరించింది. 15 ఏళ్ల సర్వీసులో నాలుగు ఉద్యోగోన్నతులు పొంది ప్రస్తుతం కర్నల్‌ ర్యాంకు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచీ దేశం పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారని మిత్రులు, బంధువులు ‘ఈనాడు’కు తెలిపారు.

చిన్ననాటి నుంచే దేశభక్తిని నూరిపోసిన తండ్రి

సంతోష్‌ తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ ఎస్‌బీఐలో పనిచేసేవారు. సైన్యంలో చేరాలనేది ఆయన కోరిక. కానీ అది సాకారం కాలేదు. చివరకు కొడుకును సైన్యంలో చేర్పించి తన కలలను నెరవేర్చుకోవాలని.. భరతమాత రుణం తీర్చుకోవాలని అనుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును సైన్యంలోకి పంపడమేంటని అందరూ వారించారు.. అయినా ఆయన పట్టు వీడలేదు. చిన్నప్పటి నుంచే కుమారుడికి దేశభక్తిని నూరిపోశారు. సైన్యంలో చేరాలనే పట్టుదలను పెంచారు.

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చేర్పించారు. తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం సంతోష్‌ ఆర్మీలో పనిచేయడమే లక్ష్యంగా చదివారు. 2004లో లెఫ్టినెంట్‌ హోదాలో సైన్యంలోకి ప్రవేశించారు. శత్రుమూకను, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో సత్తా చూపారు. చివరకు దేశమాత కోసం నేలకొరిగారు. ‘‘నా కుమారుణ్ని ఆర్మీలో చేర్పించి దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. అందుకు తగినట్లుగా ముందునుంచీ సిద్ధం చేశాను. 6వ తరగతిలోనే సైనిక్‌ స్కూల్లో చేర్పించాను. ఇందుకోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. సంతోష్‌కు చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. అన్ని స్థాయిల్లో టాపర్‌గా నిలిచేవాడు. వాళ్ల బ్యాచ్‌ వారితో అందరితో ఎప్పుడూ సరదాగా ఉండేవాడు’’ అని సంతోష్‌ తండ్రి ఉపేందర్‌ తెలిపారు.

నెల రోజుల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ

సంతోష్‌కు నెల రోజుల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా నేపథ్యంలో సరిహద్దుకు చేరుకోవాల్సిన బెటాలియన్‌ రాలేకపోవడంతో తమ కుమారుడు ఇంకా అక్కడే విధులు నిర్వహించాల్సి వచ్చిందని తండ్రి ఉపేందర్‌ పేర్కొన్నారు. ఇటీవల ఫోన్‌ చేసినప్పుడు మరో నెల రోజుల్లో హైదరాబాద్‌కు బదిలీపై వచ్చేస్తున్నానని చెప్పాడన్నారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని తండ్రి వివరించారు.

తల్లిదండ్రులతో మాట్లాడిన ఒక్కరోజులోనే..

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన చెల్లెలు శ్రుతి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పిన సంతోష్‌ ఆరోజు రాత్రే తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నట్లు వార్తలు వస్తుండటంతో అక్కడే పనిచేస్తున్న సంతోష్‌ను తల్లి ‘జాగ్రత్తగా ఉండు బిడ్డ’ అని చెప్పగా.. ‘నేను జాగ్రత్తగానే ఉన్నానని.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఇలా మాట్లాడిన ఒక్కరోజులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కర్నల్‌ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

‘‘ఒక తల్లిగా కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. దేశం కోసం నా కుమారుడు ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉంది’’ అని సంతోష్‌బాబు తల్లి మంజుల అన్నారు. ‘‘నా కొడుకు ఎంతో ధైర్యవంతుడు. చాలా తెలివైనవాడు. సున్నిత మనస్కుడు. కుటుంబ బంధాల విలువ అతనికి బాగా తెలుసు. అందరితో కలివిడిగా ఉంటాడు. ఎప్పుడూ మా ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు నన్ను, వాళ్ల నాన్నను చాలా బాగా చూసుకుంటాడు. నేను ఇబ్బంది పడితే అస్సలు తట్టుకోలేడు. ఒక్కోసారి వంటింట్లోకి వచ్చి నాకు సాయం చేస్తుంటాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాను. ఎలా ఉన్నారని అడిగాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని.. ఇప్పుడు బిజీగా ఉన్నానని.. తర్వాత ఫోను చేస్తానని చెప్పి పెట్టేశాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అని పేర్కొన్నారు.

తల్లిగా గర్వపడుతున్నా: మంజుల

ABOUT THE AUTHOR

...view details