New Judges: రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - ఏపీకి కొత్త న్యాయమూర్తులు
రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం పదోన్నతి కల్పించింది.
new judges
By
Published : Jul 20, 2022, 5:05 PM IST
|
Updated : Jul 21, 2022, 4:25 AM IST
సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో న్యాయాధికారులుగా పని చేస్తున్న వీరికి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొలీజియం నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.
37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 24 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ సుబానీ షేక్ పేరును కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయనతోపాటు, ఈ ఏడుగురి పేర్లకూ కేంద్రం ఆమోదముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. గత రెండు రోజుల్లో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం అలహాబాద్ హైకోర్టుకు 9 మంది, కర్ణాటక హైకోర్టుకు అయిదుగురు న్యాయాధికారుల పేర్లను సిఫార్సు చేసింది.
ఐదుగురికి గుంటూరుతో అనుబంధం:సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఏడుగురిలో ఐదుగురు గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ఎ.వి.రవీంద్రబాబు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కొద్దికాలం విధులు నిర్వహించిన అనంతరం హైకోర్టులో నియమితులయ్యారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వి.ఆర్.కె.కృపాసాగర్ గతంలో గుంటూరు 1వ అదనపు జిల్లా జడ్జిగా పని చేశారు. బి.శ్యామ్‌సుందర్ నరసరావుపేటలో అదనపు జిల్లా జడ్జిగా, టి.మల్లికార్జునరావు, డి.వి.రమణ గురజాలలో అదనపు జిల్లా జడ్జిలుగా విధులు నిర్వహించారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల వివరాలు..
అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు:మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం (ప్రస్తుత బాపట్ల) జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం స్వగ్రామం. తల్లిదండ్రులు రాఘవరావు, సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి వచ్చారు. 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. విశాఖలోని అనిశా కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు ప్రాంతాల్లో న్యాయాధికారిగా సేవలు అందించారు. పీడీజేగా పనిచేశారు. 2021 డిసెంబరు నుంచి ఏపీ హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా (ఆర్‌జీ) కొనసాగుతున్నారు.
డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్:వీబీకే విఠల్, పుష్పవతి దంపతులకు 1963లో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం, న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది న్యాయ సేవలు అందించారు. లా జర్నల్స్‌కు పలు వ్యాసాలు రాశారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో న్యాయాధికారులకు సీనియర్ ఫ్యాకల్టీగా రెండేళ్లు పని చేశారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే) పని చేస్తున్నారు. ఆయన సతీమణి సత్యవతి అదనపు జిల్లా జడ్జిగా కర్నూలులో పని చేస్తున్నారు.
బండారు శ్యాంసుందర్:తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుబ్రహ్మణ్యం. 1962లో అనంతపురంలో జన్మించారు. తాత బండారు రంగనాథం క్రిమినల్ కేసులు చూసే ప్రముఖ న్యాయవాది. శ్యాంసుందర్ 1986లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి అదే ఏడాది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఐదేళ్లు అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా 1991లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. తర్వాత పదోన్నతి పొంది సీనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జిగా న్యాయసేవలు అందించారు. ప్రస్తుతం విజయవాడలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్నారు.
ఊటుకూరు శ్రీనివాస్:ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి, భార్య లక్ష్మీప్రసన్న. గుంటూరు మున్సిపల్ హైస్కూల్, తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మచిలీపట్నం డీఎస్‌ఆర్ హిందూ న్యాయ కళాశాలలో చదివారు. న్యాయాధికారిగా 1994 మేలో చిత్తూరులో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్, కర్నూలులో న్యాయసేవలు అందించారు. ప్రస్తుతం కాకినాడలో మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు.
బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి:తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి బి.పాపారాయ చౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. కాకినాడలో ప్రాక్టీసు చేశారు. 1994లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులో చేరారు. 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కేసును ప్రత్యేక జడ్జిగా విచారించారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా పని చేశారు. 2019లో విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా న్యాయసేవలందించారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌గా (ఐటీ-సీపీసీ) కొనసాగుతున్నారు.
తల్లాప్రగడ మల్లికార్జునరావు:శ్రీరామచంద్రమూర్తి, రమణ దంపతులకు ద్వితీయ పుత్రుడు. 1964 జనవరి 19న కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు స్వస్థలం. పదోతరగతి వరకు నేదునూరులో, బీఎస్సీ అమలాపురంలో అభ్యసించారు. రాజమహేంద్రవరంలోని జీఎస్‌కేఎం న్యాయకళాశాలలో న్యాయ విద్య చదివారు. ప్రస్తుత బాపట్ల జిల్లా పర్చూరులో 1994లో అదనపు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టారు. ధర్మవరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2006లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది మచిలీపట్నం, ఏలూరులో న్యాయసేవలు అందించారు. ప్రస్తుతం నూజివీడులో అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్నారు.తి
దుప్పల వెంకటరమణ:వరహాలమ్మ, అప్పన్న దంపతులకు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం చిన్నబొడ్డేపల్లిలో 1963 జూన్ 3న జన్మించారు. తండ్రి రైల్వేశాఖలో గ్యాంగ్‌మన్‌గా పని చేశారు. విధి నిర్వహణలో ఉండగా 1976లో ఆయన కన్నుమూశారు. దీంతో వెంకటరమణకు అన్న వెంకటసత్యం చదువు చెప్పించారు. ప్రాథమిక విద్య బొడ్డేపల్లి, తోటాడ గ్రామాల్లో జరిగింది. విజయనగరం ఎంఆర్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. విశాఖలోని ఎన్‌వీపీ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1989లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తదితర కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 1994 మే 4న మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులో చేరారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా, తర్వాత డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. కాకినాడ, గురజాలలో న్యాయసేవలు అందించారు. తితిదే న్యాయాధికారిగా 2015 నుంచి 2017 వరకు పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. హైకోర్టు రిజిస్ట్రార్ (నియామకాలు)గా పని చేశారు. 2020 ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రార్‌గా (పరిపాలన) సేవలు అందిస్తున్నారు.