ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రఘురామ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు: కోర్టులో జగన్ కౌంటర్

By

Published : Jun 1, 2021, 11:20 AM IST

Published : Jun 1, 2021, 11:20 AM IST

Updated : Jun 1, 2021, 8:29 PM IST

jagan cbi case breaking
jagan cbi case breaking

11:17 June 01

అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ..ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో..ముఖ్యమంత్రి జగన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కౌంటర్‌లో పేర్కొన్న జగన్.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయ వ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులను పిటిషన్‌లో ప్రస్తావించలేదని... కౌంటర్‌లో జగన్‌ పేర్కొన్నారు. ఫలితంగా రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. మరోవైపు సీబీఐ కోర్టులో... మెమో దాఖలుచేసిన సీబీఐ.. ఎంపీ పిటిషన్‌పై చట్టప్రకారం, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. జగన్‌, సీబీఐ కౌంటర్లపై రిజాయిండర్లు దాఖలు చేసేందుకు రఘురామ తరఫు న్యాయవాది గడువు కోరగా.. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించి వేగంగా విచారణ జరపాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్​పై... ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. రఘరామకృష్ణరాజు తన వ్యక్తిగత, రాజకీయ, ప్రచారం కోసం దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణార్హం కాదని కౌంటర్​లో పేర్కొన్నారు. రఘురామ వాడిన ఆరోపణలు, భాష.. ఆయన దురుద్దేశాలకు అద్దం పడుతున్నాయని కౌంటర్​లో జగన్ పొందుపర్చారు.  

సంచలనాలకు, ప్రచారాలకు న్యాయప్రక్రియను వాడరాదని జగన్ వ్యాఖ్యానించారు. వైకాపాకు చెందిన రఘురామ ప్రవర్తన కారణంగా ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని గతేడాది జులై 3న దరఖాస్తు చేసినట్లు వివరించారు. అనర్హత వేటు దరఖాస్తు, తర్వాత పరిణామాలు ఈ పిటిషన్ వెనక రఘురామ రాజకీయ దురుద్దేశాలను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. పిటిషన్ వేసినప్పటి నుంచి రఘురామ విడుదల చేస్తున్న వీడియోలు, ప్రకటనలు ఆయన ప్రచార, రాజకీయ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయన్నారు.  

క్రిమినల్ కేసులు దర్యాప్తు సంస్థలు, నిందితులకు మధ్య మాత్రమేనని గతంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని కౌంటర్​లో జగన్ వివరించారు. దర్యాప్తు సంస్థలు విఫలమైనప్పుడు బాధితులు మాత్రమే కోర్టును ఆశ్రయించవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొందన్నారు. కానీ ఈ కేసులో రఘురామ బాధితుడు కాదని.. సీబీఐ విఫలమైందని ఆయన కూడా పిటిషన్​లో ఆరోపించలేదన్నారు. బెయిల్ రద్దు కోసం సీబీఐ పిటిషన్ దాఖలు చేయడం లేదని మాత్రమే ప్రస్తావించారని కౌంటర్​లో పేర్కొన్నారు.  

ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందని.. సమాచారం, దస్త్రాలన్నీ ఇప్పుడు కోర్టు అధీనంలోనే ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. బెయిల్ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటున్నానని.. ఎప్పుడూ ఉల్లంఘించ లేదని జగన్ స్పష్టం చేశారు. తన ప్రవర్తనపై సీబీఐ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. గతంలో జగతి పబ్లికేషన్స్ ద్వారా ఓ ఇంటర్వ్యూను సీబీఐ తప్పుగా అర్థం చేసుకొని బెయిల్ రద్దు చేయాలని కోరిందని.. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చిందని వివరించారు.  

సీబీఐ కేంద్రం పరిధిలో ఉంటుదని.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాదని కౌంటరులో జగన్ పేర్కొన్నారు. తాను సాక్షులను ప్రభావితం చేస్తున్నానని, వేధిస్తున్నానన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి, ధర్మాన, అయోధ్య రామిరెడ్డి, కోనేరు ప్రసాద్ వంటి ఇతర నిందితులంతా గ్యాంగ్​గా ఏర్పడ్డారన్న ఆరోపణలు నిరాధారమని కౌంటరులో పేర్కొన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులతో సంబంధం లేదన్నారు. ప్రతివాదులుగా లేని సీఎస్, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  

వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావడం లేదని.. కోర్టు విచారణకు సహకరించడం లేదనే అంశంపై జగన్ వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ దాదాపు రోజువారీగా వేగంగా జరుగుతోందన్నారు. విచారణ వాయిదా వేయాలని తాను ఎప్పుడూ కోరలేదని... తప్పుడు కేసులు కొట్టేయాలన్న ఉద్దేశంతో విచారణకు సహకరిస్తున్నట్లు కౌంటర్​లో జగన్ వివరించారు.  

ముఖ్యమంత్రిగా కరోనా వంటి విపత్తు నుంచి ప్రజలను కాపాడే బాధ్యత తనపై ఉన్నందునా... కోర్టు అనుమతితో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటున్నానని.. తన బదులుగా న్యాయవాది ప్రతీ విచారణకు హాజరవుతూనే ఉన్నారని వివరించారు. తన వ్యక్తిగత గైర్హాజరు విచారణకు జాప్యం ఎలా అవుతుందో పిటిషన్​లో వివరించలేదన్నారు. బ్యాంకు రుణాల ఎగవేసిన అభియోగాలతో రెండు కేసులతో పాటు.. మరో 7 క్రిమినల్ కేసులున్నాయన్న విషయాన్ని రఘురామ తన పిటిషన్​లో ప్రస్తావించకుండా కోర్టును తప్పుదోవ పట్టించారని జగన్ వివరించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్​కు విచారణ అర్హత లేదని కొట్టివేయాలని కోర్టును జగన్ కోరారు.

ఇదీ చదవండి:

SV Prasad Death: మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత.. చంద్రబాబు సంతాపం

Last Updated : Jun 1, 2021, 8:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details