CM Jagan: అభిమానులకు బీపీ వచ్చింది.. రియాక్ట్ అయ్యారు: సీఎం జగన్ - సీఎం జగన్ వార్తలు
12:02 October 20
పేదలకు మంచి జరిగితే విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: సీఎం
టీవీల్లో వచ్చే తిట్లు, అసభ్యపదజాలం వినలేక మనల్ని అభిమానించేవాళ్లు, ప్రేమించేవాళ్లు చూపించిన ప్రతిస్పందన రాష్ట్రమంతా కనిపించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఏ రోజు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు.. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు.. కావాలని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆరాటం కనిపిస్తోందని విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘జగనన్న తోడు’ పథకం కింద 2020 నవంబరు నుంచి 2021 సెప్టెంబరు 30 వరకు రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్ బటన్ నొక్కి, జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజలు ప్రేమ, ఆప్యాయతలు చూపుతుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టడానికీ వెనుకాడరు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడతారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పేదవాడికి మంచి జరగకూడదు.. జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని దాన్ని ఆపేందుకు కోర్టుల్లో రకరకాల కేసులు వీళ్లే వేయిస్తారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పరిపాలన సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. ఇంకా మంచి చేస్తానని తెలియజేస్తున్నాను’ అని వెల్లడించారు. ‘మీరిచ్చిన ఈ అధికారంతో ఇప్పటికే సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, ఎక్కడ వివక్ష, అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చినందున పంచాయతీ ఎన్నికల నుంచి పురపాలక, పరిషత్, తిరుపతి ఉప ఎన్నిక ఇలా ప్రతి ఎన్నికలోనూ ప్రతిపక్షానికి స్థానమే లేకుండా చేశారు’ అని జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Security: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. అదనపు బలగాల పహారా