2023 జూన్ నాటికి రాష్ట్రంలో భూముల రీసర్వే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రీసర్వేను..పకడ్బంధీగా నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని సూచించారు. అవినీతిరహితంగా, ఆదర్శంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు.
సర్వే చేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహా..రికార్డులు అప్‌డేట్ చేసి రైతులకు భూమికార్డులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. త్వరగా సర్వే చేపట్టేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాలన్నారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని..అవసరమైతే నిపుణుల సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. దేశంలో సమగ్ర భూసర్వే పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు వివరించారు.
సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానన్నారు.