ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ వ్యాధి: సీఎం జగన్

రాష్ట్రంలో కొవిడ్ కట్టడి కోసం అమలు చేస్తోన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న సమయం ప్రకారం యథావిధిగా నియమావళి వర్తింపజేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్థులను చేర్చాలని సీఎం ఆదేశించారు. ఆ వ్యాధికి చికిత్స చేసే ఆస్పత్రులను నోటిఫై చేయాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ వల్ల తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకోవాలన్న సీఎం... ఆ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఆరోగ్య స్త్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ వ్యాధి: సీఎం జగన్
ఆరోగ్య స్త్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ వ్యాధి: సీఎం జగన్

By

Published : May 17, 2021, 6:13 PM IST

Updated : May 17, 2021, 11:23 PM IST

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న దృష్ట్యా రోజూ నమోదవుతోన్న కరోనా కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కేసుల సంఖ్య అదుపులోనే ఉందని, మరికొంత కాలం కర్ప్యూ పొడిగిస్తే బాగుంటుందన్న అధికారుల సూచన మేరకు.. రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశించారు.

బ్లాక్ ఫంగస్​పై అప్రమత్తంగా ఉండాలి

కర్ఫ్యూ విధించి 10 రోజులు దాటిందని, ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కర్ఫ్యూని యథాతథంగా ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని, ప్రస్తుతం అమలయ్యే.. సమయ వేళలు సహా నియమావళి అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. డయాబెటిక్, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని సమావేశంలో అధికారులు వివరించారు. ఆ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

నోటిఫైడ్ ఆసుపత్రులను గుర్తించాలి

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్థులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలని సీఎం సూచించారు.

ఆ పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలి

ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. మందులు కూడా అందించాలన్నారు. 'కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టాలి. వాటిలో అన్ని సదుపాయాలు కల్పించాలి. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలి. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా ఆలోచన చేయాలి.' అని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆక్సిజన్ డిమాండ్ ఉంది

రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నులు కేటాయించగా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో కలిపి రోజూ 590 మెట్రిక్‌ టన్నుల నుంచి 610 టన్నుల వరకు ఆక్సిజన్‌కు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజూ ఒక ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 80 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్‌ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రోజూ కనీసం 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను బళ్లారి నుంచి సరఫరా చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్‌ఓ కంటైనర్లు రాగా, మరో రెండు కంటైనర్లు కూడా వస్తున్నాయని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసుత్తం 625 కొవిడ్‌ కేర్‌ ఆస్పత్రులలో 47,825 బెడ్లు ఉన్నాయని, వాటిలో 38,492 బెడ్లు నిండాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వారిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు, 23,463 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు, 17,246 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు, 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోని 52,471 బెడ్లలో 17,417 ఆక్యుపైడ్‌ అని వివరించారు.

ఇదీ చదవండి:ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Last Updated : May 17, 2021, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details