ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు: సీఎం జగన్ - ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్న ముఖ్యమంత్రి

ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ప్రభుత్వానికి అప్పగించే విషయంలో ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి జగన్ మరోమారు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చని, లేదా ఇప్పడున్నట్లుగా నడుపుకోవచ్చని తెలిపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్న సీఎం..యాజమాన్యాలకు, టీచర్లకు, విద్యార్థులకు మంచి చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

cm jagan held meeting with cmo officers over aided schools issue
ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు: సీఎం జగన్

By

Published : Nov 2, 2021, 8:11 PM IST

Updated : Nov 3, 2021, 3:27 AM IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు ఎంతో బాధ కలిగిస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో జరుగుతోన్న పరిణామాలపై చర్చించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామని సీఎం తెలిపారు. గతంలో డబ్బు ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారని ,అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారన్నారు. తర్వాత కాలంలో ఈ విద్యాసంస్థలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందన్నారు. 20 నుంచి 25 ఏళ్లుగా ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంతో.. ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయని సీఎం వివరించారు. దీనివల్ల యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్‌ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ వివరించారు. ఎయిడెడ్‌ యాజమాన్యంలోని వ్యక్తులు.. ఈ విద్యాసంస్థలను నడిపేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారని అన్నారు. ఈ కారణాలన్నీ ఎయిడెడ్‌ విద్యాసంస్థల నిర్వీర్యానికి దారితీశాయన్నారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైతం చాలాకాలం నుంచి తమను ప్రభుత్వంలో భాగం చేయాలని కోరుతున్నారని సీఎం వివరించారు. పాతకాలం భవనాలు సైతం శిథిలావస్థకు చేరాయని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే..ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా కోరామన్నారు. నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి అప్పగిస్తే..నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తామని చెప్పినట్లు తెలిపారు. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తామని, ఛారిటీ కింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తామని తెలిపినట్లు సీఎం వివరించారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని..వారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి ప్రైవేట్‌గా నడుపుకోవచ్చని సీఎం తెలిపారు. లేదంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యథా ప్రకారం నడుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే..అలాకూడా చేయొచ్చన్నారు. దీనికికూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

NREGS bills: గుత్తేదారులకు 4 వారాల్లో నగదు చెల్లించండి: హైకోర్టు

Last Updated : Nov 3, 2021, 3:27 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details