తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంపై విజిలెన్స్ నివేదికలో అచ్చెన్న పేరే లేనప్పుడు ఎలా అరెస్టు చేస్తారని దుయ్యబట్టారు. ‘అచ్చెన్నాయుడిని తమ పార్టీలోకి లాక్కునేందుకు వైకాపా వందల కోట్లు ఆఫర్ చేసింది. రాను.. నిజాయతీగా ఉంటానని ఆయన చెప్పడంతో ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో ఆయన ప్రమేయముందని ప్రచారం చేశారు. నేను తప్పు చేయలేదు.. ఇలానే ఉంటానని అచ్చెన్న స్పష్టం చేయడంతో దొంగ దెబ్బ కొట్టారు’ అని మండిపడ్డారు. ‘అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? జగన్‌లా దోచుకున్న డబ్బుతో ప్యాలెస్‌లు కట్టారా? డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా? అడ్డూఆపూ లేని మీ దోపిడీపై పోరాడటమే తప్పా? గౌరవ ప్రజాప్రతినిధి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? కరోనా భయపెడుతున్న తరుణంలో 300 మంది పోలీసులు వెళ్లారు. 50 మంది పోలీసులు అచ్చెన్న ఇంట్లోకి చొరబడ్డారు. తనకు శస్త్రచికిత్స జరిగింది రాలేనని చెప్పినా వినలేదు. మందులు తీసుకోవడానికీ అనుమతించకుండా ఎత్తుకొచ్చి వాహనంలో పడేశారు. ఆయన భార్యకు, కుమారుడికి కూడా చెప్పలేదు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఆయనేమైనా ఉగ్రవాదా? బందిపోటా? పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నకు మద్దతుగా శనివారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూనే తెదేపా ‘వర్చువల్’ ఆందోళన నిర్వహిస్తుందని ప్రకటించారు. ఈ పోరాటానికి మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజలూ కలసిరావాలని పిలుపునిచ్చారు.
ముందు రోజే ఎలా తెలిసింది?
‘అచ్చెన్నను శుక్రవారం ఉదయం 7.20కి అరెస్టు చేశారు. కానీ.. ‘అచ్చెన్నాయుడిపై రేపు దాడి జరగబోతోందా?’ అంటూ వైకాపా నాయకులు గురువారం రాత్రి 11.45కే యువసేన పేరుతో సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు అచ్చెన్న ఇంటికి వెళ్లినప్పుడు.. గ్రామస్థులు చూడడానికి వస్తే కరోనా నిబంధనలున్నాయంటూ గద్దించి పంపించేశారు. నిబంధనలు వాళ్లకేనా? పోలీసులకు వర్తించవా? ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ఇంట్లోకి వెళ్లాక ఏసీబీ డీఎస్పీ అప్పటికప్పుడు రాసి ఆయన చేతిలో పెట్టారు. ఇదెక్కడి దారుణం? రెండు రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని రాష్ట్రమంతటా తిప్పి విజయవాడకు తీసుకొచ్చారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.
మందుల కొనుగోళ్లతో మంత్రికేం సంబంధం?
‘విజిలెన్స్ నివేదికలో అచ్చెన్న పేరు లేకపోయినా ఏసీబీ తమకు అనుకూలంగా కథనాన్ని సిద్ధం చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్లుగా పనిచేసిన రవికుమార్, రమేష్‌కుమార్, విజయకుమార్‌ల పేర్లనే విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించారు. మందుల కొనుగోళ్లలో మంత్రి పాత్ర ఉంటుందని ‘పర్చేజ్ మాన్యువల్’లోనూ లేదు. జీవోనెం.51 ప్రకారం కూడా మందుల కొనుగోళ్లలో మంత్రులకు ఏ అధికారం లేదు. కొనుగోళ్ల కమిటీదే బాధ్యత. అందుకే తెలంగాణలో ఈఎస్‌ఐ మందుల కుంభకోణం దర్యాప్తులో మంత్రిని అరెస్టు చేయలేదు’ అని చంద్రబాబు తెలిపారు.