ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మన ఇసుకపై సీఎం పెత్తనమేంటి.. నిలదీద్దాం రండి'

రాష్ట్రంలో సహజ వనరులను వైకాపా నేతలు రాబందుల్లా కొల్లగొడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నిరసిస్తూ.... విజయవాడలోని ధర్నా చౌక్‌లో 12 గంటల నిరసన దీక్ష చేపట్టిన ఆయన...కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

cbn

By

Published : Nov 14, 2019, 10:16 AM IST

రాష్ట్రంలో వైకాపా నేతలు ఏమీ లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నిరసిస్తూ... విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియాను తయారుచేసి దేశం మీదకు వదిలారని ఆరోపించారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే స్థితి కల్పించారన్న చంద్రబాబు... ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని... ఇసుక లేక పనులు నిలిచిపోవడం వల్ల 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారని అన్నారు.

ఇసుకను...ఇవాళ మాఫియాకు అప్పగిస్తారా?

తమ హయాంలో దేశంలోనే మొదటిసారిగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చామన్న చంద్రబాబు… ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు చేసి... ఇవాళ మాఫియాకు అప్పగిస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 50 మంది చనిపోయినా ఈ సర్కారు స్పందించదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుక దొరకదుగానీ... పక్క రాష్ట్రాల్లో మాత్రం ఏపీ ఇసుక ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఇసుక దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా...?

రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదన్న చంద్రబాబు... తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవరూ నష్టపోలేదన్నారు. సొంత పొలంలోని మట్టి ఇంటికి వేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలట అని చమత్కరించారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే ఇంటి దొంగలు సీఎంకు కనపడరా..? అని ప్రశ్నించారు.

జనసేనపై వ్యక్తిగత విమర్శలేంటి..?

జనసేన నాయకుడు లాంగ్‌ మార్చ్‌ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విమర్శించేవాళ్లను మేం వ్యక్తిగతంగా దూషిస్తే తట్టుకోగలరా? అన్న చంద్రబాబు... తమను విమర్శించడం మాని ప్రజలకు మేలుచేసే ఆలోచనలు చేయాలన్నారు. తప్పు అని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా?... 2430 జీవో తీసుకొచ్చి పత్రికలను ఇబ్బందిపెడతారా?.. అంటూ మండిపడ్డారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు..

అసత్యాలతో ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేయలేరని చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత సృష్టించి సిమెంట్ కంపెనీలతో సీఎం బేరసారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఉచిత ఇసుక తీసుకురావడమేనని అన్నారు. కేసులు, బెదిరింపులతో అడ్డుకోవాలని చూడడం మంచి పద్ధతి కాదని సూచించారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో ఇసుక మాఫియాను అడ్డుకుంటారని తెలిపారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి

పనులు లేకపోవడం వల్ల కార్మికులు పస్తులు ఉంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాఫియాను కట్టడిచేసి ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నారు.

ఇవి కూడా చదవండి:

టెంపో-బస్సు ఢీ.. ఏడుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details