ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ సీఎం పదవిలో ఉండటానికి అనర్హుడు: చంద్రబాబు

కొవిడ్ వ్యాక్సినేషన్​లో ప్రభుత్వం విఫలమైందని.. ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. 'టీకాలు వేయండి- ప్రాణాలు కాపాడండి' నినాదంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆందోళన చేపట్టాలన్నారు.

cbn meeting with party leaders over covid vaccination
ఈనెల 8న వ్యాక్సినేషన్​పై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

By

Published : May 6, 2021, 4:02 PM IST

Updated : May 7, 2021, 4:51 AM IST

‘రోజుకు 20 వేలకుపైగా కొవిడ్‌ కేసులు వస్తున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు. ఆక్సిజన్‌ లేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏకంగా 25% పాజిటివిటీ రేటు ఉంది. అయినా సరే గాలి మాటలు, గాలి లెక్కలు చెప్పడంలో సీఎం జగన్‌రెడ్డి సిద్ధహస్తుడు. కరోనా నియంత్రణలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు’ అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

‘కొవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ తప్ప, మరో మార్గం లేదు. ఎక్కువగా వాక్సినేషన్‌ చేసిన దేశాల్లో కరోనా తగ్గింది. అమెరికాలో సమర్థంగా వాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలో ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ చేసి ఉంటే, ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఎక్కడా పారదర్శకత లేదు. వ్యాక్సిన్లు 50% కేంద్రం ఇస్తానంటోంది. రాష్ట్రం మాత్రం 45 ఏళ్లుపైబడిన వారికే వేస్తామంటోంది. ప్రజల ప్రాణాలు కంటే ఏదీ ముఖ్యంకాదని గుర్తించాలి. 18-45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. పొరుగు రాష్ట్రాలు టీకాల కోసం పెద్దఎత్తున ఆర్డర్‌ ఇచ్చాయి. మనవద్ద మాత్రం రూ.45 కోట్లతో 13 లక్షల టీకాల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదించింది. రంగులు వేయడానికి రూ.3 వేల కోట్లు ఖర్చుపెట్టారు. రూ.1,600 కోట్లతో వ్యాక్సిన్‌ కొనుగోలుకు చేతులు రావడం లేదు. ఇటువంటి సీఎం పదవిలో ఉండటానికి అనర్హుడు’ అని ధ్వజమెత్తారు. తెదేపా సర్వసభ్య సమావేశాన్ని గురువారం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

అన్నింటా ప్రభుత్వం విఫలం

‘కరోనా ఉద్ధృతంగా ఉంటే ఇళ్లు కడతామని, కాంట్రాక్టర్లకు పనులు ఇస్తామని చెప్పడం దుర్మార్గం. నాడు-నేడుతో అవినీతికి పాల్పడటం తప్ప చేస్తున్నదేమీ లేదు. కొవిడ్‌తో ఎంతో మంది తమ బంధువులు, కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా చనిపోయారు. సబ్బం హరి వంటి నాయకులను కోల్పోయాం. అచ్చెనాయుడిని అరెస్ట్‌ చేసినపుడు కొవిడ్‌ వచ్చింది. ఇపుడు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేస్తే కొవిడ్‌ వచ్చింది. ఏమిటీ ఉన్మాదం? జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది. రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితులు తెచ్చారు’ అని మండిపడ్డారు. ‘ఎన్ని పడకలు ఉన్నాయి? ఎంత ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. తెదేపా హయాంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌, ఆర్టీజీఎస్‌ నాశనం చేశారు. రాష్ట్రాన్ని పాలించే నాయకుడు చేతకానివాడు కావడంవల్లే ప్రజలకు ఇన్ని సమస్యలు. విపత్తును ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాల్సింది. ఇపుడు శవాలను కూడా తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నపుడు మాట్లాడకపోతే ప్రజలు నష్టపోతారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలి. పార్టీపరంగా నియోజకవర్గానికి ఓ వైద్యుడు, హోం క్వారంటైన్‌ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తాం. వ్యాక్సినేషన్‌ కోసం పోరాడాలి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఇళ్ల వద్ద నుంచే ఫ్లకార్డులతో నిరసన తెలపాలి. కార్యకర్తలంతా ప్రజల మనోగతాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

30లో ఏడు జిల్లాలు మనవే
దేశంలో 30 జిల్లాల్లో వైరస్‌ ఎక్కువగా ఉందని కేంద్రం చెబితే, అందులో ఏడు మన రాష్ట్రంలోవే కావడం సిగ్గుచేటు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమెర్జెన్సీ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీపీసీఆర్‌్ ఫలితం వచ్చేందుకు నాలుగు రోజులు పడుతోందని, ఈలోపు కుటుంబంలో అందరికీ వైరస్‌ వ్యాపిస్తోందని నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి

Last Updated : May 7, 2021, 4:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details