స్ట్రీట్ ఫర్నిచర్‌లో భాగంగా విజయవాడలో బస్ షెల్టర్ల నిర్మాణం, నిర్వహణకు ఓ ప్రముఖ ప్రచార సంస్థకు నగర పాలక సంస్థ కాంట్రాక్టు అప్పగించింది. ప్రతి షెల్టర్ నిర్మాణానికి 30 లక్షల రూపాయల చొప్పున వెచ్చించేందుకు అంగీకారం కుదిరింది. నిబంధనల ప్రకారం పాత షెల్టర్లు తొలగించి నూతన విధానంలో షెల్టర్ నిర్మాణం చేపట్టి....అందులో ఏసీ, ఫర్నిచర్, కాఫీ షాప్, వైఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, టాయిలెట్‌తోపాటు సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఒక్కో షెల్టర్ 100 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలి. టెండర్లు వేసిన 7 నెలలైనా అలాంటి బస్ స్టాపులు కనిపించడంలేదు.
నగరంలో 50 అడుగులు దాటకుండా నిర్మాణాలు చేపట్టారు. అవీ నాన్ ఏసీ బస్ షెల్టర్లు. మౌలిక సదుపాయల ఊసే లేదు. కేవలం ప్రచారం కోసం బస్టాపులు నిర్మించుకుందాం అన్న రీతిలో రూపొందించారు. ఈ స్టాపుల్లో ఎక్కడా బస్సుల క్రమసంఖ్య, సమయాల పట్టిక లేదు. ఎండ, వాన పడకుండా నిర్మాణాలు చేయలేదు.
బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట లాంటి ప్రదేశాల్లో అసలు ఇలాంటి బస్ స్టాపులే కనిపించవు. ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కనీసం కూర్చునేందుకు సీట్లైనా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.