వెంకటేశ్...ఓ మంచి ఆటోవాలా! - police
నేను ఆటోవాణ్ని...ఆటోవాణ్ని..అన్నగారి రూటువాణ్ని..స్వచ్ఛమైన మనసున్న వాణ్ని అనే పాట అచ్చంగా ఓ ఆటోడ్రైవర్‌కు సరిపొతుంది. తన ఆటోలో మరిచిపోయిన సొమ్మును...సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేసి తన ఉన్నతమైన మనసును చాటుకున్నాడు వెంకటేశ్ అనే ఆటో డ్రైవర్.. విషయంలోకి వెళ్తే..
విజయవాడలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం వచ్చారు కోదండరామ్..తన కుమార్తె నిహారిక. ముందుగా దుర్గమ్మను దర్శనం చేసుకోవాలని బయల్దేరారు. దర్శనం హడావుడిలో పడి 2.15 లక్షల నగదు, నిహారిక సర్టిఫికెట్లు ఆటోలోనే మరిచిపోయారు. తర్వాత తిరిగి వచ్చేసరికి ఆటోలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరస్థితి. విజయవాడ ఒకటో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆటో నెంబరు చెప్పలేకపోయారు బాధితులు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు...ఆటోపై ఆత్మబంధువు అని పోస్టర్ రాసి ఉండడాన్ని గమనించారు. దాని ఆధారంగా పోలీసులు ఆటో ఆచూకి కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో ఇంటికి చేరుకున్న ఆటోడ్రైవర్ వెంకటేశ్ తన ఆటోలో ఉన్న బ్యాగును గమనించాడు. వెంటనే మరో ఆటోడ్రైవర్‌తో కలిసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్, సర్టిఫికెట్లు అందించాడు. ఈ విషయం తెలిసిన బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ కాశీ విశ్వనాథ్ సమక్షంలో బ్యాగును బాధితుడు కోదండరామ్‌కు ఆటోడ్రైవర్ చేతుల మీదుగా అప్పగించారు. నిజాయితీ చాటుకున్న వెంకటేశ్‌ను పోలీసులు అభినందించి..నగదు రివార్డు అందజేశారు.