ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు - తెదేపా నేత పట్టాభిపై దాడి

attack on tdp leader pattabhi
attack on tdp leader pattabhi

By

Published : Feb 2, 2021, 10:58 AM IST

Updated : Feb 3, 2021, 5:34 AM IST

10:57 February 02

తెదేపా నేత పట్టాభిపై దాడి, కారు ధ్వంసం

కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి

విజయవాడ నడిబొడ్డున పట్టపగలు మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది. ప్రముఖులు ఉండే అంబేడ్కర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో పట్టాభిపై విచక్షణరహితంగా దాడి చేసిన దుండగులు నిమిషాల్లో పరారయ్యారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తన ఇంటినుంచి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి కారులో బయలుదేరారు. మలుపు తిరిగాక కొద్దిదూరంలో స్పీడ్‌బ్రేకర్‌ ఉండటంతో వాహన వేగం తగ్గింది. అక్కడే కాచుకుని ఉన్న దుండగులు ఒక్కసారిగా దాడిచేశారు. తొలుత ముందు అద్దంపై రాళ్లు విసిరారు. కారులో ఉన్న పట్టాభి తేరుకునేలోగానే ఆరుగురు వచ్చి కారును చుట్టుముట్టి దాడిచేశారు. కారు తలుపు లాగి, పట్టాభిని ఇష్టారాజ్యంగా కొట్టారు. ఈ దాడిలో పట్టాభికి ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, తొడ భాగంలో దెబ్బలు తగిలాయి. కారు అద్దాలు పగిలి తలపై గుచ్చుకున్నాయి. డ్రైవర్‌ మురళికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెద్దగా అరిచేసరికి దుండగులు పారిపోయారు. అనంతరం డ్రైవర్‌ కారును ఇంటికి తీసుకొచ్చారు. షాక్‌లో ఉన్న పట్టాభి ఇంటికి వచ్చి.. నొప్పులు తాళలేక ఆవరణలోని మంచంపైనే పడుకున్నారు. నగర సెంట్రల్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పటమట సీఐ సురేష్‌రెడ్డి, మాచవరం సీఐ వినయ్‌మోహన్‌ తదితరులు ఘటనా స్థలానికి వచ్చారు. ధ్వంసమైన కారు, ఘటనాస్థలంలో దుండగులు వాడిన కర్రలు, పెద్ద రాళ్లను క్లూస్‌ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెండో సారి దాడి
నాలుగు నెలల వ్యవధిలో పట్టాభిపై రెండుసార్లు దాడి జరిగింది. గత ఏడాది అక్టోబరు 4న ఇంటి బయట ఉన్న పట్టాభి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి,  తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. తర్వాత.. ఇంటి వద్ద పటమట పోలీసులు బీట్‌పుస్తకం పెట్టినా.. నవంబరు 23న, డిసెంబరు 18 తేదీల్లోనే పోలీసుల సంతకాలు అందులో ఉన్నాయి. ప్రాణహాని ఉందని తెలిసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పట్టాభి తల్లి రమాదేవి, భార్య చందన ఆరోపించారు.

ప్రభుత్వానిదే బాధ్యత పట్టాభి : భార్య చందన

న భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి భార్య చందన మండిపడ్డారు. ఇంటినుంచి వెళ్లిన నిమిషంలోనే తన భర్త రక్తగాయాలతో వచ్చారని, కొంతకాలంగా ఆయనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

పక్కాగా రెక్కీ
దాడి జరిగిన తీరును గమనిస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పట్టాభి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అందుకే మలుపు తీసుకున్నాకే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. స్పీడ్‌బ్రేకర్‌ వద్ద వాహనవేగం తగ్గుతుందని.. ఆ ప్రాంతాన్నే దాడికి ఎంచుకున్నారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం ఎదురుగా ఉన్న ఇంట్లో సీసీ కెమెరా ఉన్నా.. దూరంగా ఉండటంతో దృశ్యాల్లో స్పష్టత కొరవడింది. దాడి చేసి, వెంటనే పరారయ్యేందుకు వీలుగా రెండు ద్విచక్ర వాహనాలను స్టార్ట్‌ చేసి ఉంచారు. అదే సమయంలో ఓ కారు అటుగా వెళ్లింది. ఇది నిందితులదేనా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటరిగానే ప్రయాణం
ప్రాణహాని ఉందని పసిగట్టిన పట్టాభి.. అప్పటినుంచి ఒంటరిగా బయటకు వెళ్లడం లేదు. నలుగురు పార్టీ కార్యకర్తలను కారులో వెంటబెట్టుకుని వెళ్లేవారు. మంగళవారం ఇంటినుంచి ఒక్కరే బయలుదేరారు. తాను బయల్దేరానని, పార్టీ కార్యాలయానికి రమ్మని ఎప్పుడూ తనవెంట ఉండే టీఎన్‌టీయూసీ నేతలకు చెప్పారు. మంగళవారం అత్యవసర పని ఉండటంతో, వెంట ఎవరూ లేకపోయినా బయలుదేరారని పట్టాభి తల్లి, భార్య చెబుతున్నారు.


ఆసుపత్రికి తరలింపు
దాడి మెడికో లీగల్‌ కేసు అవుతుందని, ఫిర్యాదు ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు పట్టాభిని అడిగారు. దీనిని ఆయన తిరస్కరించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వచ్చేవరకూ తాను కదలబోనని, ఆసుపత్రికీ రానని స్పష్టంచేశారు. తనకు ప్రాణహాని ఉందని ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తుచేశారు. తనపై దాడి జరిగినా, గాటు పడినా.. దానికి డీజీపీ సవాంగ్‌, సీఎం జగన్‌ బాధ్యత వహించాలని పలుసార్లు చెప్పానన్నారు. వైకాపా ప్రభుత్వ అవినీతిని తాను బయటపెడుతున్నందుకే దాడి జరిగిందన్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరంలో దాడికి ప్రణాళిక రూపొందించినట్లు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు పట్టాభిని పరామర్శించారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత పట్టాభిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. నేతలు అడ్డుకోగా.. బలవంతంగా పట్టాభిని వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్‌, దేవినేని ఉమా, పరుచూరి అశోక్‌బాబు, కొల్లు రవీంద్ర తదితరులు అడ్డుతగిలారు. వారిని పక్కకు తోసివేశారు. పోలీసు వాహనం ముందు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, బోడే ప్రసాద్‌ తదితరులు బైఠాయించారు. చంద్రబాబు పిలుపు మేరకు పట్టాభిని తీసుకుని ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికి తెదేపా నేతలు వెళ్తారన్న అనుమానంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు
నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ1 హర్షవర్ధన్‌రాజుతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడి, దాడి తీరును అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. నిందితులు వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు, నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను సీపీ ఏర్పాటుచేశారు. పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో వడబోస్తున్నారు.


గాయపడ్డ పట్టాభిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే, ఈసీజీ, స్కాన్‌ తీశారు. ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించగా, ఆయన తిరస్కరించి.. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత సీఎం జగన్‌, సజ్జల, మంత్రి కొడాలి నాని తీసుకోవాలన్నారు. ఇద్దరు రౌడీషీటర్లు కొక్కిలగడ్డ జాన్‌, మధు సాయంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి హంతకులను తీసుకొచ్చి దాడి చేయించారని ఆరోపించారు. రాష్ట్ర సీఎం అయినా, మంత్రి అయినా చట్టాలకు అతీతులు కారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాను ఒంటినిండా గాయాలతో ఇబ్బంది పడుతుంటే.. పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారని, ఏడుస్తున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎనిమిది సెక్షన్ల కింద కేసు
పట్టాభి స్టేట్‌మెంటును పోలీసులు రికార్డు చేశారు. పదిమంది వరకు దాడిలో పాల్గొన్నట్లు అందులో పేర్కొన్నారు. అంతా 20-30 ఏళ్ల మధ్య వయస్కులేనన్నారు. హత్యాయత్నం, మారణాయుధాలతో గుంపుగా వచ్చి దాడి చేయడం, కారు ధ్వంసం, అడ్డగింపు, తదితర కారణాలతో మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసు పెట్టారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితులు స్థానికులు కాదన్న నిర్ణయానికి వచ్చారు.

ఇదీ చదవండి: 

నిమ్మాడలో ఉద్రిక్తత.. అచ్చెన్నాయుడు అరెస్టు

Last Updated : Feb 3, 2021, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details