సుప్రీం కోర్టు తీర్పుతోనైనా అమరావతిపై దుష్ప్రచారం మాని ప్రజారాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ సహకరించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హితవు పలికారు. అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ వేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్నది స్పష్టమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఉన్న అమరావతి రెక్కలు విరచటమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న జగన్..తన తీరును మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఎలాంటి ఖర్చూ లేకుండా అమరావతి నుంచి పాలన కొనసాగించే అవకాశం ఉన్నా..,మూడు రాజధానులనే తుగ్లక్ నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తానని ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించిన జగన్...అధికారంలోకి రాగానే మాటెందుకు మార్చారని నిలదీశారు. అమరావతి అభివృద్ధితోనే 13 జిల్లాల అభివృద్ధి, యువతకు ఉపాధి, సంపద సృష్టి సాధ్యమని ఇకనైనా గుర్తించాలని హితవు పలికారు.