ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap high court fires on police: నిందితుల్ని అక్రమ నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారు: హైకోర్టు

ap high court fires on police: పోలీసులపై.. హైకోర్టు ఘాటుగా స్పందించింది. వ్యక్తులను అరెస్ట్‌ చేసిన తరువాత 24 గంటల్లోగా వారిని మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. అక్రమంగా నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారని ప్రశ్నించింది. నిందితులను వారం, పది రోజులు తమ దగ్గర ఉంచుకుంటే పోలీసులు లాలూచీ పడ్డారని సందేహించాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ap high court fires on police
అరెస్ట్‌ చేశాక 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరచడం లేదు

By

Published : Dec 2, 2021, 7:53 AM IST

ap high court fires on police: వ్యక్తులను అరెస్ట్‌ చేసిన తరవాత 24 గంటల్లోగా వారిని మేజిస్ట్రేట్ల ముందు పోలీసులు హాజరుపరచకపోవడంపై.. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారిని అక్రమంగా నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారని ప్రశ్నించింది. నిందితులను వారం, పది రోజులు తమ దగ్గర ఉంచుకుంటే పోలీసులు లాలూచీ పడ్డారని సందేహించాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాలపై ప్రతిరోజూ తమ ముందుకు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయని గుర్తు చేసింది. ఇదే పరిస్థితి ఇకపై కొనసాగితే రాష్ట్ర డీజీపీని పిలిచి వివరణ కోరతామని హెచ్చరించింది. కావాలంటే గతంలో పనిచేసిన చోట ఏమి చేశానో రికార్డులు పరిశీలించుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వ్యాఖ్యానించారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులు అమాయకులని తాము చెప్పడం లేదన్నారు. వారికి హక్కులు, స్వేచ్ఛ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అరెస్టు చేసిన 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాల్సిందేనని తెల్చి చెప్పారు. ఓబుల్‌రెడ్డి వెంకటప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి అక్రమ నిర్బంధం విషయంలో నివేదిక ఇవ్వాలని కడప జిల్లా పులివెందుల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ap high court: తన భర్త వెంకటప్రసాద్‌రెడ్డిని ఎస్‌ఈబీ పోలీసులు నవంబర్‌ 24న అదుపులోకి తీసుకున్నారని, ఇప్పటి వరకూ మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టలేదని పేర్కొంటూ కడప జిల్లా నారేపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి వెంకట లక్ష్మమ్మ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు అతనిని ప్రవేశపెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ వెంకటప్రసాద్‌రెడ్డి ఓ కేసులో రెండో నిందితుడిగా ఉన్నారన్నారు. వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details