కృష్ణా నది నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద ఒక బ్యారేజీని, బండికొళ్లలంక వద్ద మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈమేరకు పరిపాలనా అనుమతుల్ని ప్రభుత్వం జారీ చేసింది. దశలవారీగా ఈ బ్యారేజీలను నిర్మించనున్నారు.
తొలిదశలో రెండు బ్యారేజీలకు 204.37 కోట్ల రూపాయల మేర పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. చోడవరం - రామచంద్రాపురం వద్ద బ్యారేజీ నిర్మాణంలో తొలి దశకు 102.17 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేటాయించారు. అలాగే బండికోళ్లంక - రావి అనంతవరం వద్ద మరో బ్యారేజీ నిర్మాణంలో తొలి దశ కోసం మరో 102.20 కోట్ల కేటాయిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, భూ సేకరణ, పర్యావరణ పరిస్థితుల అధ్యయనం ఈ మొత్తాలను వెచ్చించనున్నారు.