ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP High Court: ఫీజుల ఖరారుపై.. 53, 54 జీవోలను తోసిపుచ్చిన హైకోర్టు - ఫీజుల ఖరారుపై ప్రభుత్వ జీవోలు కొట్టివేత

ఫీజుల ఖరారుపై ప్రభుత్వ జీవోలు 53, 54లను తోసిపుచ్చిన హైకోర్టు
ఫీజుల ఖరారుపై ప్రభుత్వ జీవోలు 53, 54లను తోసిపుచ్చిన హైకోర్టు

By

Published : Dec 27, 2021, 2:22 PM IST

Updated : Dec 28, 2021, 3:38 AM IST

14:20 December 27

ప్రభుత్వానికి చుక్కెదురు

AP High Court: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల జీవోలను భౌగోళికప్రాంతాలవారీగా వర్గీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆగస్టులో జారీచేసిన జీవోలను రద్దుచేసిన న్యాయస్థానం మార్చి 31లోపు కొత్తగా ఖరారు చేయాలని ఆదేశించింది.కమిషన్‌కు ఫీజులు నియంత్రించే అధికారమేగానీ, ఖరారు చేసే అధికారం లేదని తేల్చిచెప్పింది.

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు రుసుములు ఖరారు చేస్తూ ఆగస్టు 24న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 53, 54 జీవోలను హైకోర్టు రద్దు చేసింది. విద్యా సంస్థలను భౌగోళిక ప్రాంతాలవారీగా విభజించడాన్ని తప్పుపట్టింది. నిబంధన 8ని అనుసరించి తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆదేశించింది. అన్ని ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఫీజుల ప్రతిపాదనలను ఆహ్వానించాలని నిర్దేశించింది. 2022 మార్చి 31లోగా కొత్తగా 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు రుసుములను సిఫారసు చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఖరారు చేయబోయే రుసుముల కంటే 2021-22 విద్యా సంవత్సరానికి ఇప్పటికే యాజమాన్యాలు అధికంగా వసూలుచేసి ఉంటే ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. తక్కువ వసూలు చేసి ఉంటే మిగిలిన సొమ్మును విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు కీలక తీర్పు ఇచ్చారు.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అని ప్రాంతాల వారీగా విభజించి పాఠశాలలకు రుసుములను ఎలా సిఫారసు చేస్తారని కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థకు, అదే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న విద్యా సంస్థకు ఒకే రకమైన రుసుములను నిర్ణయించడం సరికాదని ఆక్షేపించింది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలనూ కాపాడాలని సూచించింది. రుసుములను సిఫారసు చేసేటప్పుడు విద్యా సంస్థలు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని పేర్కొంది. చట్ట ప్రకారం ఫీజులు నియంత్రించే అధికారమే కమిషన్‌కు ఉందికానీ ఖరారు చేసే అధికారం లేదని, ఒక చెక్‌లిస్టు ప్రకారం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ఆటస్థలం, మరుగుదొడ్లు, నిర్వహణ ఖర్చులు తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలను వర్గీకరించి, ఫీజులను సిఫార్సు చేయాలని కమిషన్‌కు స్పష్టం చేసింది. ఏటా ఉత్పన్నమవుతున్న ఫీజుల వివాదానికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ధర్మాసనం సూచించింది.

ఏకపక్షంగా జోవోలు జారీ..
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. అయితే, వీటిని సవాలు చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి.

రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారంటూ వాదనలు వినిపించాయి. అయితే, పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఆ జీవోలను తోసిపుచ్చింది.

ఇదీ చదవండి

Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా

Last Updated : Dec 28, 2021, 3:38 AM IST

ABOUT THE AUTHOR

...view details